కరోనానుకూడా కట్టడి చేస్తాం

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో గురువారం రాత్రి 9గంటల వరకు ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 363కు చేరింది. కొత్తగా ప్రకాశంలో 11, గుంటూరులో 2, తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. కాగా ఇప్పటివరకు కరోనా నుంచి 10 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. గురువారం అనంతపురానికి చెందిన వ్యక్తి, గుంటూరుకు చెందిన మరొకరు మృతి చెందడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. అంతకుముందు 12 గంటల వ్యవధిలో నిర్వహించిన 217 శాంపిల్స్‌లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అన్నీ కూడా నెగెటివ్ వచ్చాయి.

దీంతో ప్రభుత్వ, వైద్యవర్గాలు చాలా ఆనందం వ్యక్తం చేశాయి. ఇక ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

కానీ.. ఊహించని విధంగా గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో మాత్రం 15 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అయినా.. గత కొద్దిరోజులతో పోల్చుకుంటే.. చాలా తక్కువ కేసులే నమోదు అవుతున్నాయని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో కర్నూలు, గుంటూరు తదితర జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ జిల్లాలో మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటే.. ఏపీలో కరోనా తోకముడిచినట్టేనని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరంతర పర్యవేక్షణతో ముందుకు వెళ్తోంది. కరోనా మహమ్మారి కట్టడికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇప్పటికే ర్యాపిడ్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరికొద్దిరోజుల్లోనే కరోనానుకూడా కట్టడి చేసి.. దేశానికి మార్గదర్శకంగా ఉంటామని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి.