కరోనాపై పోరాటం..బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల విరాళం
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా పై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక అండగా నిలిచేందుకు రూ. 25 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ‘ ఇది మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన సమయం. ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. నా వంతుగా నేను దాచుకున్న మొత్తం నుంచి రూ. 25 కోట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నా.అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్థిగా ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను’అంటూ అక్షయ్‌కుమార్ ట్వీట్ చేశారు. ఈ బాలీవుడ్ స్టార్ హీరో చేసిన గొప్ప పనికి అతని అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అయితే బాలీవుడ్ హీరోలలో ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ ఒక్కరే విరాళం అందించడం నెటిజన్లకు రుచించడం లేదు. ‘ అమితాబ్, ఖాన్ త్రయం మాటల వరకే పరిమితమా.. ఆర్థిక సహాయం అందించరా’అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘సినిమాలతో డబ్బులు బాగానే సంపాదించారు కదా? విరాళం ఇవ్వడానికి ఏం అడ్డొస్తుంది?’అంటూ మరి కొంతమంది గట్టిగానే నిలదీస్తున్నారు. ఇక బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడ్ హీరోలు చాలా బెటర్ అంటూ మరికొంతమంది పేర్కొంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్లు ప్రధాన మంత్రి సహాయక నిధికి విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా వారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.
కాగా, కరోనా మహమ్మారిపై పోరాడటానికి, దాని నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వాలకు నిధులు చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నిధులను సేకరించడంలో దేశ ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో పీఎం-కేర్స్ ఫండ్‌ను ప్రధాని ప్రారంభించారు. విరాళాలు పంపాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలను ఈ సందర్బంగా ట్వీట్ చేశారు. ప్రజలు ఇచ్చే ఒక్కో రూపాయి డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను పటిష్టం చేయడానికి, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని ట్వీట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.