కరోనా వైరస్ నియంత్రణ కు… ఏపీ సీఎం జగన్ సూచనలు

కరోనా నియంత్రణలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వచ్చే మూడు వారాల పాటు ప్రజలందరు ఎక్కడ వున్న వారు అక్కడే వుండడం ద్వరా కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రకు రావాలనుకుంటున్న వారు తమ ప్రయత్నాలను మానుకుని, అక్కడే వుండిపోవాలని జగన్ సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణను అడ్డుకోవాలంటే, కాంట్రాక్టు ట్రేసింగ్ ప్రాసెస్ కొనసాగించాల్సి వుందని, అందుకు ఎవరి వారు ఎక్కడుంటే అక్కడే ఆగిపోవడమే ఉత్తమమని ముఖ్యమంత్రి అంటున్నారు.

తెలంగాణ నుంచి ఆంధ్రలోని తమతమ స్వస్థలాలకు రావాలనుకుంటున్న వారిని సరిహద్దులో ఆపాల్సి రావడం బాధగానే వున్నా… తప్పడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ఇలా రావాలనుకుంటున్న వారు.. ఇక్కడికి వస్తే.. తమ సొంత వారికి, కుటుంబీకులకు వైరస్‌ని అంటించినవారు అవుతారన్న ఉద్దేశంతోనే రానివ్వడం లేదన్నారు. అందుకే రాష్ట్రంలోని ఎంటరయ్యే అన్ని సరిహద్దులను మూసివేసినట్లు చెప్పారాయన.

ఇలా వచ్చే వారు కూడా నేరుగా తమ కుటుంబంతో కలిసే ఛాన్స్ లేదని, వారిని 14 రోజుల పాటు క్వారెంటైన్ సెంటర్లకు తరలిస్తామని అందువల్ల వారంతా ఎక్కడ వున్న వారు అక్కడే వుండిపోతే బెటరని గుర్తించాలని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో వుండిపోయిన ఆంధ్ర వారికి షెల్టర్ కల్పించాలని కేసీఆర్‌తో మాట్లాడానని, ఆయన కూడా ఎంతో సానుకూలంగా స్పందించారని, కాబట్టి ఎవరూ ఆందోళన చెంద వద్దని తెలిపారు జగన్.

మార్చి ఒకటవ తేదీ నుంచి 27 వేల 819 మంది విదేశాల నుంచి ఏపీకి వచ్చినట్లు తేలిందని, వారందరినీ గుర్తించి క్వారెంటైన్ చేస్తున్నామని, మూడు వారాలలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందన్న నమ్మకం వుందని సీఎం వివరించారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ ఆసుపత్రులను 2500 బెడ్లతో ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా నియంత్రణ కార్యక్రమంలో తీవ్రంగా శ్రమిస్తున్న వాలెంటర్లకు, ఆశా వర్కర్లకు, హెల్త్ అసిస్టెంట్లను ముఖ్యమంత్రి అభినందించారు. డాక్టర్లు, పోలీసులను కూడా ఆయన కొనియాడారు.

కరోనా సోకిన వారిలో 80.9 శాతం మందికి ప్రాణాపాయం వుండదని, వారంతా ఇళ్ళలో ఐసోలేట్ అవడం ద్వారానే బయట పడొచ్చని సీఎం వివరించారు. 14 శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చని, మరో 4.8 శాతం మంది మాత్రమే ఐసీయులో చికిత్స పొందాల్సి వస్తుందని ఆయన వివరించారు. మూడు వారాల్లో కరోనాను నియంత్రించగలమన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.