త‌ల్లీబిడ్డ‌ల ఆరోగ్యానికి పెద్ద‌పీట వేయాలి

గ‌ర్భ‌వ‌తులు ప‌రీక్ష‌ల కోసం వ‌చ్చిన‌ప్పుడు త‌ల్లీబిడ్డ‌లు ఇద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితిని స‌మ‌గ్రంగా అంచ‌నా వేయాల‌ని, ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రికి ఎలాంటి స‌మ‌స్య ఉన్నా.. ఇత‌ర విభాగాల వైద్యుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ముందుగానే త‌గిన చికిత్స‌లు అందించ‌డం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడాల‌ని సీనియ‌ర్ వైద్యులు సూచించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ క‌డ‌ల్స్ ఆస్ప‌త్రిలో ఆదివారం నిర్వ‌హించిన హైరిస్క్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ పెరినాటాల‌జీ – హోప్ అనే స‌ద‌స్సులో ఈ విష‌యాలు వివ‌రించారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల నుంచి 250 మందికి పైగా వైద్యులు, ప్ర‌ధానంగా గైన‌కాల‌జిస్టులు, పిల్ల‌ల వైద్య‌నిపుణులు దీనికి హాజ‌ర‌య్యారు. దేశం న‌లుమూల‌ల నుంచి కార్డియాల‌జిస్టులు, న్యూరోస‌ర్జ‌న్లు, గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టులు, నెఫ్రాల‌జీ-యూరాల‌జీ విభాగాల నిపుణులు.. ఇలా ప‌లు విభాగాల‌కు చెందిన 60 మంది అత్యంత సీనియ‌ర్ వైద్యులు వ‌చ్చి త‌మ త‌మ విభాగాల‌లో త‌ల్లీబిడ్డ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండే అవ‌కాశాలుంటాయో, వాటిని ఎలా గుర్తించి చికిత్స‌లు అందించాలో వైద్యుల‌కు వివ‌రించారు. కిమ్స్ క‌డ‌ల్స్ క్లినిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బాబు ఎస్ మ‌దార్క‌ర్, గైన‌కాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ త్రిపుర‌సుంద‌రి, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ వేమ ప‌ద్మావ‌తి, నేతృత్వంలో ఈ స‌ద‌స్సు జ‌రిగింది. దీనికి శాస్త్రీయ క‌మిటీ స‌భ్యులుగా డాక్ట‌ర్ చీపురుప‌ల్లి వ‌సుంధ‌ర‌, డాక్ట‌ర్ జి.ఉమాదేవి, డాక్ట‌ర్ ఎం. మాధ‌వి, డాక్ట‌ర్ శ‌శిక‌ళా జైన్, డాక్ట‌ర్ ఎన్. బిందుప్రియ‌, డాక్ట‌ర్ సింధూర వ‌డ్డ‌మాని వ్య‌వ‌హ‌రించారు.

స‌ద‌స్సులో కిమ్స్ క‌డ‌ల్స్ క్లినిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బాబు ఎస్ మ‌దార్క‌ర్ మాట్లాడుతూ, “గ‌ర్భిణులు ఆస్ప‌త్రికి వ‌చ్చిన‌ప్పుడు ప‌రీక్ష‌లు చేస్తే ఆమెకు, లోప‌లి శిశువుకు ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు ఉండొచ్చు. వాట‌న్నింటినీ న‌యం చేయ‌డానికి అన్ని విభాగాల వైద్యులు ఒకేచోట ఉండ‌డం చాలా ముఖ్యం. ఉదాహ‌ర‌ణ‌కు త‌ల్లికి గానీ, శిశువుకు గానీ గుండె స‌మ‌స్య ఉంటే కార్డియాల‌జిస్టు అవ‌స‌రం ఉంటుంది. వాళ్ల‌కు, గైన‌కాల‌జిస్టుకు మ‌ధ్య స‌రైన స‌మ‌న్వ‌యం ఉండాలి. అప్పుడే త‌ల్లీబిడ్డ‌ల‌ను స‌రిగా కాపాడ‌గ‌లం. అలాగే శ‌రీరంలో వివిధ‌భాగాల్లో స‌మ‌స్య‌లుండొచ్చు. రోగ‌నిరోధ‌క శ‌క్తి అస‌లు లేక‌పోవ‌డం, బాగా ఎక్కువ ఉండ‌డం, మెద‌డులో స‌మ‌స్య‌లు, ఉద‌రం, లివ‌ర్, కిడ్నీల్లో స‌మ‌స్య‌లు, ర‌క్త‌సంబంధిత స‌మ‌స్య‌లు, గ‌ర్భిణికి క్యాన్స‌ర్ ఉండొచ్చు.. ఇలాంటి ఏ స‌మ‌స్య ఉన్నా కూడా అత్యాధునిక ప‌రిశోధ‌న‌ల ఆధారంగా చికిత్స‌లు ఎలా చేయాల‌న్న విష‌య‌మై ఇక్క‌డ చ‌ర్చించిన విష‌యాలు అంద‌రికీ ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయి. ఇది రోగుల ఆరోగ్యంపై మంచిప్ర‌భావం చూపించింది. త‌ల్లీబిడ్డ‌ల ఇద్ద‌రి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి స‌ద‌స్సులు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి” అని తెలిపారు.

కిమ్స్ క‌డ‌ల్స్‌లో గైన‌కాల‌జీ విభాగాధిప‌తి డాక్ట‌ర్ త్రిపుర‌సుంద‌రి మాట్లాడుతూ, “గ‌ర్భ‌వ‌తులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటూ ఉండాలి. దానివ‌ల్ల వాళ్ల ఆరోగ్యంతో పాటు, గ‌ర్భ‌స్థ శిశువు ఆరోగ్యం ఎలా ఉంద‌న్న‌ది కూడా ఇప్పుడు వ‌స్తున్న అత్యాధునిక ప‌రీక్ష‌ల ద్వారా తెలుస్తుంది. ముందుగానే తెలుసుకుంటే చాలా స‌మ‌స్య‌ల‌కు మంచి చికిత్స‌లు ఉంటాయి. వీటి గురించి గ‌ర్భ‌వ‌తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌ధానంగా గైన‌కాల‌జిస్టుల మీదే ఉంటుంది. స్కానింగ్ అంటే కొంత‌మందిలో అపోహ‌లు ఉంటాయి. అలాంటివాటిని దూరం చేసి, స‌మ‌గ్ర వైద్య ప‌రీక్ష‌ల ఆవ‌శ్య‌క‌త‌ను వారికి వివ‌రించాలి. త‌ద్వారా త‌ల్లీ బిడ్డ‌ల ఆరోగ్యాన్ని కాపాడాలి” అని సూచించారు.