తాటిచెట్టులా పెరిగినా బుద్ధి మాత్రం పెరగలేదు
తాటిచెట్టులా పెరిగినా కొందకరి బుద్ది మాత్రం పెరగలేదంటూ ప్రతిపక్ష నేతకు సీఎం రేవంత్ రెడ్డి చురకలంటించారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకు రావట్లేదన్నారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే హైదరాబాద్‌కు గోదావరి జలాలు వస్తున్నాయని వివరించారు. నిజాం సర్కార్ దూరదృష్టితో జంట జలాశయాలను నిర్మించడం వల్లే నగరానికి వచ్చిన వాళ్లకు తాగునీరు అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ సమీపంలోని గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులోభాగంగా హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 జలాశయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి మున్సిపల్ మంత్రి శామీర్‌పేట వద్ద గోదావరి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నారని గుర్తు చేశారు. నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే మీరు చేసిన పాపాలు ఎక్కడ పోవంటూ బీఆర్ఎస్ నేతలకు ఆయన చురకలంటించారు. మూసి నదిలో ప్రవహించే నీరు విషంగా మారి పశువులు, మనుషుల ప్రాణాలు తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి నది నల్గొండకు విషాన్ని మోసుకెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఎవరు ఏమన్నా మూసి నది ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు.











