మంత్రి గంగులను పరామర్శించిన తోట చంద్రశేఖర్

 బీఆర్ఎస్ పార్టీలో చేరి, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ నేడు తెలంగాణలో పర్యటించారు. కరీంనగర్ వెళ్లి మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించారు. ఇటీవల గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) కన్నుమూశారు. పితృవియోగంతో బాధపడుతున్న మంత్రి గంగుల కమలాకర్ కు తోట చంద్రశేఖర్ తన సంతాపం తెలియజేశారు. గంగుల మల్లయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేసీఆర్ పాలనను వేనోళ్ల కీర్తించారు. 15 ఏళ్ల కిందట కరీంనగర్ కు వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు కనిపిస్తోందని, ఎటుచూసినా పచ్చదనం, జలకళ ఉట్టిపడుతోందని వివరించారు. కేసీఆర్ పాలనకు, ఆయన చేసిన అభివృద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారని, ఆయన చేసిన అభివృద్ధిని ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నానని తెలిపారు. కేసీఆర్ సూచనలతో ఏపీని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తోట చంద్రశేఖర్ చెప్పారు.