చైనాలాగే మనకూ రావచ్చు.. మాస్కుతోనే మనకు రక్ష
చైనాలో ఉద్ధృతంగా వస్తున్న కొవిడ్ కేసులు, మరణాలను చూసైనా మనం అప్రమత్తం కావాలని.. ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం సూచించారు. చైనాతో సహా పలు దేశాల్లో ప్రస్తుతం వ్యాపిస్తున్న బిఎఫ్.7 ఉపరకం ఒమిక్రాన్ కేసు ఒకటి ఇటీవలే కేరళలోనూ వెలుగు చూసిందని, ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మనమంతా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
‘‘మాస్కులు తీసేయొచ్చని, బహిరంగ ప్రదేశాల్లో అవి ధరించక్కర్లేదని భారత ప్రభుత్వం ఈమధ్య చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనోమ్ కూడా కరోనా అంతం త్వరలోనే ఉంటుందని చెప్పారు. కానీ చైనాలో ఇప్పుడు కొవిడ్ అత్యంత తీవ్రస్థాయిలో ఉంది. జీరో కొవిడ్ పాలసీ అన్నది షి జిన్ పింగ్ గతంలో అవలంబించిన విషయం. అది ఉన్నప్పుడు అక్కడ రోజూ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసేవారు. దాంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. ఫలితంగా ఆంక్షలు ఎత్తేశారు. దాంతో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. 2023 మార్చి నాటికల్లా 3.22 లక్షల కొవిడ్ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని చైనా శాస్త్రవేత్తలే చెబుతున్నారు. 2023 ఏడాది మొత్తమ్మీద అయితే 10 లక్షల మంది మరణిస్తారని అంచనా. చైనా జనాభాలో దాదాపు మూడోవంతు మందికి ఏప్రిల్ నాటికి కరోనా సోకుతుందని చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ చాలా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. మొదటి వేవ్ బీజింగ్ షాంఘై లాంటి నగరాల్లో వస్తుంది. త్వరలో క్రిస్ట్ మస్ పండగ, కొత్త సంవత్సర వేడుకలు ఉన్నాయి. చైనా, జపాన్, కొరియా, వియత్నాం తదితర దేశాలకు జనవరి 22న చాంద్రమాన కొత్త సంవత్సరం. వాళ్లకది చాలా ముఖ్యమైన పండగ. ఆరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడతారు. కార్మికులందరూ తమతమ ఊళ్లకు వెళ్తారు. వారివల్ల ఆయా ప్రాంతాలకు విస్తరిస్తుంది. అది రెండోవేవ్. ఫిబ్రవరిలో వాళ్లు తిరిగి నగరాలకు వచ్చినప్పుడు మూడో వేవ్ వస్తుంది.
చైనాలో ఇప్పటికే పాఠశాలలన్నింటినీ దాదాపుగా మూసేశారు. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ. 60 సంవత్సరాల పైబడినవారు 30 కోట్ల మందికి పైగా ఉన్నారు. 80 ఏళ్లు దాటినవారిలో టీకాలు తీసుకున్నవారు చాలా తక్కువ. బూస్టర్ డోసు 30 శాతం, రెండు డోసులు తీసుకున్నవారు 50 శాతమే ఉన్నారు. దానికితోడు అసలు చైనాటీకాపై ఆ దేశస్థుల్లోనే నమ్మకం చాలా తక్కువ. అందువల్ల కూడా వాళ్లు టీకాలు తీసుకోవట్లేదు. పెద్ద వయసువారు టీకాల కంటే సంప్రదాయ వైద్యాల మీద నమ్మకం ఎక్కువ. 60, 70 ఏళ్లు దాటినవారు వైద్యం చేయించుకోవచ్చు, లేదు. అది వాళ్ల ఇష్టం. మన దేశంలో మాత్రం వృద్ధులకు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇచ్చాము. అందువల్లే ఇక్కడ తీవ్రత తగ్గింది. బిఎఫ్.7 అనే రకం ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం లాంటి దేశాల్లో ఉంది.
మన దేశంలో కేసులు కొద్దిసంఖ్యలోనే వస్తున్నాయి. కానీ ఎంతమంది లక్షణాలున్నా పరీక్షలు చేయించుకుంటున్నారో, వాటి వివరాలు వెల్లడిస్తున్నారో తెలియదు. అమెరికాలోనూ 2, 3 లక్షల కేసులు వస్తున్నాయి. నిన్నమొన్నటివరకు సాకర్ ప్రపంచకప్, తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ కేసుల విషయం బయటకు రావట్లేదు. కట్టుదిట్టంగా ఉండే అమెరికాలోనే పెద్దసంఖ్యలో కేసులు వస్తున్నాయంటే మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్కు వేసుకోవడం మంచిది. కొత్త సంవత్సరం, పండగలు చాలా వస్తున్నాయి. అలాగని జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్నచోటుకు వెళ్లొద్దు. బూస్టర్ డోసులు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. ఇప్పటికే బిఎఫ్.7 వేరియంట్ ఉన్న దేశాల నుంచి ఎవరైనా ఇక్కడకు వస్తే, అది ఇక్కడకూ వచ్చే ప్రమాదముంది. మాస్కు అనేది ముఖ్యమైన కవచం కాబట్టి తప్పనిసరిగా మాస్కు ధరించాలి’’ అని ఆయన వివరించారు.