ఇక భారత్ రాష్ట్ర సమితి
తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాలని ఈ ఏడాది దసరా పర్వదినం రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం విదితమే. ఎట్టకేలకు కేసీఆర్ రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. పార్టీ మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. దీంతో పార్టీ నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Loaded: 0.16%Fullscreen
ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా శుభఘడియల్లో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన జాతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరునే భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధికారిక ప్రకటన చేశారు.
టీఆర్ఎస్ పేరును మారుస్తూ దసరా రోజున నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు చోటు చేసుకుంది. సుమారు 8 రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు అని కేసీఆర్ ఆ రోజున తీర్మాన ప్రతిని చదివి వినిపించారు.