అత్యంత ప్రాణాంత‌క‌మైన బోర్హావ్‌ సిండ్రోమ్‌కు థొరాకోలాప్రోస్కోపిక్ ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స‌

భోజ‌నం చేసిన త‌ర్వాత వెంట‌నే ఉన్న‌ట్టుండి ఆగ‌కుండా వాంతులు అవుతుంటే ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. అలా చేస్తే కొన్నిసార్లు ప్రాణాంత‌కం కావ‌చ్చు. అత్యంత అరుదుగా సంభ‌వించే బోర్హావ్ సిండ్రోమ్‌కు స‌రైన స‌మ‌యంలో స‌రైన‌చికిత్స చేయ‌డం ద్వారా ప్రాణాలు కాపాడిన సంఘ‌ట‌న కొండాపూర్ కిమ్స్ ఆస్ప‌త్రిలో చోటుచేసుకుంది. అనిల్ అనే 30 ఏళ్ల యువ‌కుడు రాత్రి తిన్న త‌ర్వాత వాంతులు ఆగ‌కుండా అవుతూ ఉండ‌టంతో అత‌డిని నాలుగు గంట‌ల్లోగా కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. అక్క‌డ క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు & అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపిక్ స‌ర్జ‌న్ సీహెచ్ న‌వీన్‌కుమార్ అత‌డిని ప‌రీక్షించారు. అత‌డికి ఎద భాగంలో ఎడ‌మ‌వైపు తీవ్ర‌మైన నొప్పి ఉండ‌టంతో పాటు ఊపిరి పీల్చుకోలేక‌పోతున్నాడు. అత‌డి ఆహార‌నాళం దెబ్బ‌తిన‌డంతో పాటు ఆహారం, మాంసం ముక్క‌లు చెస్ట్ కావిటీలో ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే అత్య‌వ‌స‌రంగా స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జీ నిపుణులు డాక్ట‌ర్ న‌వీన్‌కుమార్‌, డాక్ట‌ర్ మ‌ధులిక అత‌డికి థొరాకోలాప్రోస్కోపిక్ ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స చేసి, ఆహార‌నాళాన్ని అత్యున్న‌త సాంకేతిక ప‌ద్ధ‌తిలో బాగు చేశారు. శ‌స్త్రచికిత్స చేసేట‌ప్పుడు చూస్తే, ఆహార‌నాళం 4 సెంటీమీట‌ర్ల మేర చిరిగిపోయి ఉంది, ఆ లోప‌ల ఆహారం, మాంసం ముక్క‌లు ఉన్నాయి. వాట‌న్నింటినీ లోప‌ల నుంచి పూర్తిగా తీసేయ‌డానికి దాదాపు రెండు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. అవ‌న్నీ తీసేసిన త‌ర్వాత ఆహారనాళానికి రిపేర్ చేశాం. దాని త‌రువాత రోగి పూర్తిగా కోలుకొని 8 రోజుల పాటు ఆస్ప‌త్రిలో ఉంచిన త‌ర్వాత సాధార‌ణంగా ఆహారం తీసుకోగ‌లిగాడు. స‌రైన స‌మ‌యానికి, మినిమ‌ల్లీ ఇన్వేజివ్ ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స చేయ‌డంతో అత‌డు అంత వేగంగా కోలుకోగ‌లిగాడు.
ఏమిటీ బోర్హావ్ సిండ్రోమ్‌?
ఉన్న‌ట్టుండి తీవ్రంగా వాంతులు కావ‌డం వ‌ల‌న ఆహార‌నాళం దెబ్బ‌తిన‌డాన్ని బోర్హావ్ సిండ్రోమ్ అంటారు. ఇది చాలా అరుదైన‌, అత్యంత ప్రాణాంత‌క‌మైన ప‌రిస్థితి. ఈ సిండ్రోమ్‌లో ఆహార దెబ్బ‌తిన‌డం వ‌ల‌న ఆహారం ప‌దార్థాలు చెస్ట్ కావిటీలోకి వెళ్తాయి. దీనికి స‌రైన స‌మ‌యంలో స‌రైన చికిత్స అందించ‌క‌పోతే దాదాపు 30-50% రోగులు మ‌ర‌ణిస్తారు. చాలామంది రోగుల‌కు వెంటిలేట‌ర్ పెట్టి, కొన్ని వారాల నుంచి నెల‌ల పాటు ఐసీయూ/ఆస్ప‌త్రిలో ఉంచి, అనేక శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం కావ‌చ్చు. కొన్నిసార్లు తీవ్ర‌మైన ఇన్ఫెక్ష‌న్ ఏర్ప‌డ‌టంతో ఆహార‌నాళాన్ని తీసేయాల్సి ఉంటుంది కూడా.