నాన్న జీవితాన్ని ఇస్తే… కూతురు పునర్జ‌న్మ‌మ‌నిచ్చింది

రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షులు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల సింగపూర్‌లోని వైద్యులు కిడ్నీ మార్పిడి సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆయన కిడ్నీ మార్పిడి చేయించాలని నిర్ణయించారు.అయితే లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ ఇచ్చేందుకు ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య ముందుకొచ్చారు. తన కిడ్నీలలో ఒకదానిని తండ్రి ఇవ్వాలని రోహిణి నిర్ణయం తీసుకున్నారు.దీంతో దీర్ఘకాలంగా మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు కుమార్తె రూపంలో కొత్త ఊపిరి లభించనుంది.

అయితే ఈ ప్రతిపాదనకు లాలూ ప్రసాద్ యాదవ్ తొలుత అంగీకరించలేదని సమాచారం.తండ్రి ఆరోగ్యం మెరుగుపడాలనే లక్ష్యంతో రోహిణి ఒత్తిడి చేయడంతో ఇందుకు ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల నుంచి కిడ్నీ దానం ద్వారా సక్సెస్ రేటు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు మరో కారణంగా తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ అక్టోబర్ లో సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.కిడ్నీ మార్పిడి చికిత్సను వారు సూచించారు.దీంతో తన తండ్రికి ఒక మూత్రపిండాన్ని ఇస్తానని కుమార్తె రోహిణి వైద్యులకు తెలిపినట్టు తెలిసింది. రోహిణి ప్రస్తుతం సింగపూర్‌లో నివాసం ఉంటున్నారు.అక్కడే లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి చికిత్స జరగనుంది.

నవంబర్ 20-24 మధ్య లాలూ మళ్లీ సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉందని.ఆ సమయంలోనే కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కోర్టు అనుమతితో లాలూ ప్రసాద్ యాదవ్ సింపూర్ వెళ్లాల్సి ఉంటుంది.