ఫిజియోథెరపీకి పెరుగుతున్న ప్రాధాన్యం – డా. దివ్య
శారీరక సమస్యలకు దివ్యౌషధం ఫిజియోథెరపీ. ముఖ్యంగా మోకాళ్లు, నడుము, భుజం, మెడ నొప్పులతోపాటు పక్షవాతం, వెన్ను సమస్యలు, నరాల సంబంధ వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌లేని చికిత్స ఇది. ఈ ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌తో ఆర్థో, న్యూరో సమస్యలను దూరం చేసుకోవచ్చు. డా. దివ్య సూచించిన విశేషాలతో ప్రత్యేక కథనం.
ఉరుకు పరుగుల జీవనం.. ఒత్తిడితో కూడిన పనివిధానం.. అసంబద్ధమైన ఆహారపు అలవాట్లతో పెరుగుతున్న ఊబకాయం.. శారీరక శ్రమ లేకపోవడం.. ఇలా మానవుల జీవన శైలీలో వచ్చిన మార్పులతో అనేక రుగ్మతలు చుట్టుముడుతున్నాయి. చిన్నవయస్సులోనే కీళ్లు, మోకాళ్లు, వెన్ను నొప్పులు వెంటాడుతున్నాయి. అధిక రక్తపోటు కారణంగా పక్షవాతం బారిన పడుతుండడంతో కాళ్లు, చేతులు పనిచేయక మంచానికే పరిమితమయ్యే కావాల్సిన దయనీయస్థితి. ఇలాంటి బాధితులకు సాధారణంగా అందించే వైద్య చికిత్సతోపాటు ఫిజియోథెరపీ (ఫిజికల్ ఎక్సర్‌సైజ్) ఎంతో కీలకం. ఈ వైద్యానికి రోజురోజుకూ ప్రాధాన్యం పెరుగుతున్నది.
ఫిజికల్ థెరపీ..
ఫిజియోథెరపీనే ఫిజికల్ థెరపీగా.. ఫిజికల్ ఎక్సైర్‌సైజ్ పిలుస్తుంటారు. గాయాలు, నొప్పులు, నరాల సంబంధ వ్యాధుల కారణంగా మానవుల శరీర కదలికల్లో వచ్చే మార్పులను సరిచేసేందుకు ఈ చికిత్సను అందిస్తారు. కాంతి, ధ్వని తరంగాలను విద్యుత్ వాహకం ద్వారా పంపించగా జనించే వేడితో వైద్యమందిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన సైకిళ్లు, మిషన్లను ఈ విధానంలో ఉపయోగిస్తారు. నడవలేని స్థితిలో ఉన్నవారికి, పక్షవాతంతో కాళ్లు, చేతులు దెబ్బతిన్న వారికి పలు రకాల థెరపీలను కూడా ఉపయోగిస్తారు. వెన్నెముక, కండరాలు, మెడ, మోకాళ్లు, కీళ్లు, ఇతర సమస్యలతో బాధపడేవారు, ప్రమాదంలో గాయపడి దెబ్బతిన్న వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చి పూర్తిగా నయం చేయడంలో ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుందని సంబంధిత వైద్యులు చెబుతున్నారు. ఇంటి వద్దనే శారీరక శ్రమ చేసేలా సూచనలు చేస్తున్నారు. దవాఖానకు రాలేని పరిస్థితుల్లో రోగుల ఇండ్లకు వెళ్లి చికిత్స అందిస్తున్నారు.
దినదినం సేవల విస్తరణ..
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా రోజు రోజుకు ఫిజియోథెరపీ సేవల అవసరం పెరుగుతున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 50 మందికి పైగా ఫిజియోథెరపిస్టులుగా స్థిరపడ్డారు. ఈ తరహా చికిత్సల వలన అనేక రుగ్మతలు నయమవుతున్నందునా ప్రభుత్వం కూడా తన దవాఖానాల్లో ఫిజియోథెరపీని అందుబాటులోకి తెచ్చింది. ఇపుడు వెల్‌నెస్ సెంటర్లు, మాతా శిశు ఆరోగ్య కేంద్రం, రెడ్‌క్రాస్ సొసైటీల్లో నిరుపేదలకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నో జబ్బులను మందుల ద్వారానే కాకుండా ఫిజియోథెరపీ ద్వారా నయం చేస్తున్నారు.
పెరుగుతున్న ప్రాధాన్యం..
ఫిజియోథెరపీ చికిత్సకు ప్రాధాన్యం పెరిగింది. అందుకనుగుణంగా ప్రభుత్వం వైద్యులను అందుబాటులో ఉంచాలి. వెన్నెముక దెబ్బ తినడం, రక్తపోటుపై అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది పక్షవాతం బారిన పడుతున్నారు. వీరి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వీటికి తోడు పుట్టుకతో వచ్చే అంగ వైకల్యం, ఇతర వైక్యలాలను నిర్లక్ష్యం చేయడంతో అనారోగ్య సమస్యలు ఎక్కువతున్నాయి. సాధారణ స్థితికి రావడానికి ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది.