జ‌గ‌దీష్ రెడ్డి పీఏ ఇంట్లో 48 ల‌క్ష‌లు

నల్గొండ జిల్లా మంత్రి జి.జగదీశ్​రెడ్డి పీఏ ప్రభాకర్​ రెడ్డి ఇంట్లో ఐటీ అధికా రులు సోదాలు నిర్వహించారు. నల్గొండలోని తిరుమల నగర్​లో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు తనిఖీలు జరిగాయి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాదాపు 30 మంది పైగా ఐటీ ఆఫీసర్లు, సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నల్గొండ, సూర్యాపేట జిల్లా ఆఫీసర్లను నోడల్​అధికారులుగా నియమించారు. వీరితోపాటు, ఢిల్లీ, చెన్నై ప్రాంతాలకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించారు. అయితే పీఏ ప్రభాకర్​ రెడ్డి ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు దాచిపెట్టారన్న ఫిర్యాదు మేరకు హైదరాబాద్​కు చెందిన పలువురు ఐటీ ఉన్నతాధికారులు, నోడల్​ అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విశ్వనీయ సమాచారం మేరకు రూ.49 లక్షల నగదును సీజ్​ చేశారని సమాచారం. అయితే అధికారులు దీనిని ధ్రువీకరించలేదు. రాత్రి 11 గంటల వరకు సోదాలు కొనసాగుతుండటంతో ప్రభాకర్​ రెడ్డి ఇంటి సమీపంలో స్థానిక పోలీసులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గుమిగూడారు.