సమంతకు సానుభూతి
మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి క్రేజీ హీరోయిన్ సమంత షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలిపిన దగ్గరి నుండి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం సానుభూతి తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ..సమంత త్వరగా కోలుకోవాలని.. అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
అలాగే నేచురల్ స్టార్ నాని కూడా స్పందించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత శక్తిమంతురాలివై మళ్లీ వస్తావని సమంతకు ధైర్యం చెప్పారు. తాజాగా బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. “సమంత… నువ్వు ఎంతో దృఢమైనదానివి. మయోసైటిస్ ను తప్పక ఓడిస్తావు. దేవుడు ఎప్పుడూ బాధపెట్టడు” అంటూ చెప్పుకొచ్చారు.
మయోసిటిస్ వ్యాధి లక్షణాలతో బాధపడేవారు ఎక్కువ సేపు నడవలేరు.. అలానే నిల్చోలేరు. కండరాలు బలహీనంగా మారుతుంటాయి. అలానే అతిగా నీరసం కూడా వస్తుంటుంది. అలాంటి ఈ వ్యాధి తనకు వచ్చిందని.. చాలా రోజుల నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ విషయం ఎప్పుడో చెప్పాలని భావించిందట. కానీ ప్రతీది చెప్పాల్సిన అవసరం లేదని చెప్పలేదట. లైఫ్‌లో ఎదురయ్యే ఛాలెంజ్‌లని అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే అని సమంత చెప్పుకొచ్చింది. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఇటీవల భరించలేని కష్టాలు వచ్చాయని గుర్తు చేసుకున్న సమంత.. అవి గడిచిపోయినవిగా చెప్పుకొచ్చింది. ఈ మయోసిటిస్ నుంచి కూడా త్వరలోనే కోలుకుంటానని చెప్పుకొచ్చింది.