జిల్లాలోనే మెదటి బెలూన్ వాల్వులోప్లాస్టీ
- కవాటాల మార్పిడికి బదులు సంక్లిష్టమైన బెలూన్ వాల్వులోప్లాస్టీ
- ఆరోగ్యశ్రీ పథకంలో పూర్తి ఉచితంగా చేసిన కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు
గుండె కవాటాలు మార్చాల్సిన పరిస్థితిలో ఉన్న ఐదుగురు సాధారణ కూలీలకు అంత పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా, సంక్లిష్టమైన బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే చికిత్స చేసి వారి వ్యాధిని నయం చేశారు అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు. ఈ వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డా. మూడే సందీప్ తెలిపారు. 25 నుంచి 40 ఏళ్ల వయసుగల ఈ మధ్యవయస్కులంతా వేర్వేరు సమయాల్లో తీవ్రమైన ఆయాసం, కాళ్ల వాపులు, ఛాతీనొప్పితో ఆస్పత్రికి వచ్చారు. వాళ్లకు 2డి ఎకో పరీక్ష చేయగా, వాళ్లందరికీ గుండె కవాటాలు (వాల్వులు) తీవ్రంగా దెబ్బతిని, సన్నగా అయిపోయినట్లు తెలిసింది. దానివల్ల రక్తసరఫరా సరిగా లేక వాళ్లకు ఆయాసం, ఇతర సమస్యలు తలెత్తాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో వాల్వులు మార్చి, కృత్రిమ వాల్వులు పెట్టడమే వైద్యులు సూచించే పరిష్కారం. కానీ, బెలూన్ వాల్వులోప్లాస్టీ అనే సంక్లిష్టమైన ప్రక్రియలో చికిత్స చేస్తే.. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సమస్యను నయం చేయవచ్చు.
ఎందుకీ వ్యాధి?
జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లకు సరిగా చికిత్స తీసుకోకపోవడంతో ఇన్ఫెక్షన్ పెరిగి, వాల్వులు పాడవుతాయి. నగరాల్లో అయితే ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి యాంటీ బయాటిక్స్ వాడతారు. దాంతో అవి తగ్గుతాయి. గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలే అని వదిలేయడం వల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. వివిధ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చే రుమాటిక్ సమస్యలతో గుండె కవాటాలు బాగా సన్నగా అయిపోతాయి. దానివల్ల ఆయాసం తీవ్రంగా రావడం, ఊపిరితిత్తుల్లో నిమ్ము, కాళ్ల వాపులు, ఇలాంటి పరస్థితులతో వెంటిలేటర్ మీదకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివాళ్లకు వాల్వు మార్పిడి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అందులో, సన్నబడిన వాల్వులను ఆపరేషన్ చేసి, మారుస్తారు. దానికి బదులు ఎక్కడా కోత లేకుండా కాలినుంచి చిన్నవైరు ద్వారా బెలూన్ పంపి, సన్నబడిన కవాటాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చాం. అందువల్ల రక్తసరఫరా పెరిగి సాధారణ పరిస్థితికి వస్తారు. బెలూన్ సర్జరీని పెద్దపెద్ద వైద్య కళాశాలలు, సంస్థల్లోనే చేస్తారు. సాధారణంగా చేయరు.
ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ
అందుకే దీనిబదులు బైపాస్, వాల్వు మార్పిడి చేసుకోవాలని చెబుతారు. కానీ తొలిసారి అనంతపురం కిమ్స్ సవీరా ఆస్పత్రిలో అందుకు కావల్సిన పరికరాలన్నీ తెప్పించుకుని, ఐదుగురికీ ఈ శస్త్రచికిత్స చేశాం. పైగా, ఈ మొత్తం ప్రక్రియను ఆరోగ్యశ్రీ ద్వారా చేయడంతో రోగులకు ఏమాత్రం ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా చేయడం సాధ్యమైంది” అని డాక్టర్ సందీప్ వివరించారు. డాక్టర్. రాజేష్ నటువా మరియు డాక్టర్. స్పందన ఆధ్వర్యంలో ఈ వాల్వు మార్పిడి జరిగిందని వివరించారు.
డాక్టర్. రాజేష్ నటువా మాట్లాడుతూ పెర్క్యుటేనియస్ మిట్రల్ బెలూన్ వాల్వులోప్లాస్టీ ఎంపిక చేసిన రోగులలో ఓపెన్ హార్ట్ సర్జరీ కంటే మెరుగైనది. వాల్వులోప్లాస్టీ గుండె ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు లక్షణాలను తగ్గిస్తుంది. పిబిఎంవి తర్వాత, 90% మంది రోగులు 10 సంవత్సరాల పాటు లక్షణాలు లేకుండా ఉంటారు. ఐదు మంది రోగులకు వాల్వోటమీ తర్వాత లభించిన అద్భుతమైన ఫలితాలను ప్రజలకు పంచుకోవడం సంతోషంగా ఉందని మరియు సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా చేయడంలో కిమ్స్ సవేరా కార్డియాలజీ బృందం ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందని కిమ్స్ సవీర కార్డియాలజీ బృందం డాక్టర్. బాలకిషోర్, డా. రాజేష్ నటువా, డా. మూడే సందీప్, డా. స్పందనలు పేర్కొన్నారు.