అంతా తూచ్‌…

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు నిందితుల రిమాండ్‌‌ను ఏసీబీ కోర్టు జడ్జి రిజెక్ట్ చేశారు. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేలా పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్ సెక్షన్లు నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వజూపినట్లుగా ఎలాంటి నగదు లభ్యం కాకపోవడంతో పీసీ యాక్ట్ కేసుల కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు. నిందితుల అరెస్ట్ విషయంలోనూ 41 సీఆర్‌‌‌‌పీసీ నిబంధనలు పాటించలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. 41 సీఆర్‌‌‌‌పీసీ నోటీసులు ఇచ్చి విచారించిన తరువాత తమ ముందు ప్రవేశపెట్టాలని గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు పార్టీ మారేందుకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని ఎమ్మెల్యే రోహిత్‌‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజి స్వామిపై నేరపూరిత కుట్ర 120(బి), ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్171-బి, 506 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. రిమాండ్‌‌ను జడ్జి తిరస్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

ఇప్పుడు ఫోన్ కీల‌కంగా
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్‌‌నగర్‌‌‌‌లోని పైలెట్ రోహిత్‌‌రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌లో సైబరాబాద్ పోలీసులు బుధవారం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రోహిత్‌‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌‌రెడ్డిలతోపాటు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి స్వామిజీలను పోలీసులు గుర్తించారు. డీల్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చారని సీపీ రవీంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం రోహిత్‌‌రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌లో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. కాల్‌‌డేటా, వాట్సాప్ చాటింగ్స్‌‌ను పరిశీలించారు. ఆడియో, వీడియో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద చాటింగ్స్, ఫోన్ నంబర్స్‌‌ను సేకరించారు. ఫామ్‌‌హౌస్‌‌లోని పని చేసే వాళ్ల స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేశారు. శంషాబాద్ రూరల్ పీఎస్‌‌లో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. లంచంగా ఇస్తామన్న డబ్బుకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు.

రోహిత్‌కి ఇచ్చిన ఆఫ‌ర్ అబ‌ద్ద‌మేనా ?

ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, హైదరాబాద్‌‌కు చెందిన నందకుమార్ కలిసి తనతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రోహిత్‌‌ రెడ్డి పేర్కొన్నారు. ‘‘టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయవద్దని, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని బేరసారాలు చేశారు. బీజేపీ నుంచి పోటీ చేస్తే రూ.100 కోట్లు ఇస్తామని రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి ప్రలోభపెట్టారు” అని అందులో ఆరోపించారు. డబ్బుతో పాటు కేంద్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. మాట వినకుంటే క్రిమినల్ కేసులు, ఈడీ, సీబీఐతో రెయిడ్స్‌‌ చేయిస్తామని బెదిరించినట్లు వివరించారు. డీల్‌‌ డిస్కషన్‌‌ చేసేందుకు మొయినాబాద్ అజీజ్‌‌నగర్‌‌‌‌లోని తన ఫామ్‌‌హౌస్‌‌కు బుధవారం వచ్చారని తెలిపారు. మరికొందరు ఎమ్మెల్యేలను చేర్చితే ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు.

పైస‌ల కారు గువ్వ‌ల అన‌నుచరునిదే
ఫామ్‌‌హౌస్‌‌లో గుర్తించిన టీఎస్07 హెచ్ఎమ్2777 కారు కీలకంగా మారింది. ఎమ్మెల్యేలకు రూ.వంద కోట్లు ఇచ్చేందుకు ఫామ్‌‌హౌస్‌‌లో డీల్ జరిగిందని ప్రచారం జరుగుతుండడంతో పోలీసులు ఆధారాల కోసం సెర్చ్ చేస్తున్నారు. కారులో ఉన్న 3బ్యాగ్స్‌‌ను తనిఖీ చేశారు. అందులో పూజా సామగ్రి, పంచలు, గోపంచకం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అయితే కారు వివరాలు కానీ, బ్యాగ్స్‌‌లో ఏమున్నాయనే దాని గురించి కానీ పోలీసులు వెల్లడించలేదు. రూ.100 కోట్లు అంటూ రోహిత్‌‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌ మినహా.. డబ్బుకు సంబంధించిన ఆధారాలు ఎక్కడా లభించలేదు. కారు గచ్చిబౌలి ఖాజాగూడకు చెందిన గండవరం దిలీప్‌‌కుమార్‌‌‌‌కు చెందినదిగా గుర్తించారు. దిలీప్‌‌కుమార్.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడని తెలిసింది. ఇదే కారును నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతి వారం రోజులుగా వినియోగిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌‌లో పూజలు, ఇత ర కార్యక్రమాలకు కారును తీసుకెళ్తుండేవాడని తెలిసింది. డీల్‌‌ డ్రామాలో నందకుమార్‌‌‌‌ మీడియేటర్‌‌‌‌గా కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతున్నది. రోహిత్‌‌రెడ్డితో రామచంద్రభారతిని 2నెలల కిందే పరిచయం చేసినట్లు సమాచారం. కాంట్రాక్టులు ఇప్పిస్తానని రామచంద్రభారతి చెప్పినట్లు తెలిసింది. తిరుపతికి చెందిన సింహయాజి స్వామిజీతో డిస్కస్ చేసినట్లు సమాచారం. డీల్ ఓకే అయి తే ముందు రూ.25 కోట్లు.. మళ్లీ రెండు విడతల్లో రూ.75 కోట్లు చెల్లించే లా చర్చించారని సమాచారం. రోహిత్‌‌రెడ్డి ద్వారా పార్టీలు మారే ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని నిందితులు చెప్పినట్లు చెబుతున్నారు.

నిశ‌బ్దం వెనుక మ‌ర్మ‌మేటి ?
ప్రగతి భవన్‌‌ స్కెచ్‌‌తో జరిగిన ట్రాప్‌‌లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.100 కోట్లు ఆఫర్‌‌‌‌ వచ్చిన రెండు నెలల తర్వాత రోహిత్‌‌రెడ్డికి ప్రలోభాలు గుర్తొచ్చాయా అని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఫామ్‌‌హౌస్‌‌లో డీలింగ్‌‌ గురించి పోలీసుల కంటే ముందే మీడియాకు లీకైందా అనేలా బుధవారం జరిగిన ఘటనలు కనిపిస్తున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలను రోహిత్‌‌ రెడ్డే పిలిపించారా? లేక డీల్‌‌ సమాచారం అందడంతోనే మిగతా ముగ్గురు అక్కడికి రహస్యంగా చేరుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేసేంత పెద్ద కేసులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసుపై టీఆర్ఎస్ లీడర్లను ఎందుకు సైలెంట్ చేశారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిజంగా ప్రలోభాలు, బేరసారాలు జరిగి ఉంటే.. ‘ఓటుకు నోటు’ కేసు మాదిరి రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా ఎందుకు పట్టుకోలేదని పొలిటికల్ సర్కిల్స్‌‌లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.