కిమ్స్ క‌ర్నూలులో విజ‌య‌వంతంగా మృదులాస్థి మార్పిడి శ‌స్త్రచికిత్స‌

  • మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న యువ‌కుడికి కిమ్స్ వైద్యుల ఊర‌ట‌
  • ఒకే కాలిలో ఉన్న మృదులాస్థి అదే కాలికి అమ‌రిక

‌చిన్న‌వ‌య‌సులోనే కాలికి అయిన గాయం కార‌ణంగా తీవ్ర‌మైన మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతున్న ఓ యువ‌కుడికి అత్యంత అరుదైన మృదులాస్థి మార్పిడి శ‌స్త్రచికిత్స చేసి, క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి వైద్యులు ఊర‌ట క‌ల్పించారు. అత‌డి స‌మ‌స్య‌ను, అత‌డికి అందించిన శ‌స్త్రచికిత్స వివ‌రాల‌ను ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్‌. పి. కిర‌ణ్ కుమార్ వివ‌రించారు.

“క‌ర్నూలు న‌గ‌రానికి చెందిన 30 ఏళ్ల యువ‌కుడు తీవ్ర‌మైన మోకాలినొప్పితో కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. ఆట‌ల్లో అయిన గాయం కావొచ్చ‌ని భావించి, ఎంఆర్ఐ తీసి చూస్తే, మృదులాస్థి కొంత భాగం పోయిన‌ట్లు తెలిసింది. మృదులాస్థి పోయిన‌ప్పుడు ఆ ప్రాంతం మీద బ‌రువు ప‌డితే మోకాళ్ల నొప్పులు వ‌స్తాయి. సాధార‌ణంగా పెద్ద‌వ‌య‌సు వాళ్ల‌కైతే మోకాలి మార్పిడి శ‌స్త్రచికిత్స చేస్తాం. కానీ, వ‌య‌సు త‌క్కువ కావ‌డంతో మోకాలిని కాపాడేందుకు ఓట్స్ అనే శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించాం. ఈ యువ‌కుడికి దెబ్బ త‌గ‌ల‌డం వ‌ల్ల మోకాలిపై బ‌రువు ప‌డేచోట మృదులాస్థి దెబ్బ‌తింది. అక్క‌డ ఒక గుంట‌లాగ అయిపోయింది.

సాధార‌ణంగా మ‌న కీళ్ల వ‌ద్ద మృదులాస్థి చుట్టూ ఉంటుంది. కానీ కొన్నిచోట్ల మాత్ర‌మే బ‌రువు ప‌డుతుంది, మిగిలిన చోట్ల ప‌డదు. అందువ‌ల్ల బ‌రువు ప‌డ‌ని ప్ర‌దేశం నుంచి మృదులాస్థిని సేక‌రించి, దాన్ని ఇప్పుడు దెబ్బ‌తిన్న‌చోట పెట్టాల‌ని నిర్ణ‌యించాం. ఇలాంటి శ‌స్త్రచికిత్స‌ను ఓట్స్ (osteochondral autograft transfer system) అంటారు. ఇది సాంకేతికంగా చాలా క్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌. ముందుగా దీనికి ఆర్థ్రోస్కొపిక్ ప‌రీక్ష ద్వారా మోకాలిని పూర్తిగా ప‌రిశీలిస్తాం. త‌ర్వాత మోకాలిపై రంధ్రం చేసి, దెబ్బ‌తిన్న ప్రాంతంలో ఎంత మృదులాస్థి అవ‌స‌రం అవుతుందో తెలుసుకుంటాం. త‌ర్వాత మోకాలిపై బ‌రువుప‌డ‌ని చోటు నుంచి ఎముక‌ను, మృదులాస్థిని సేక‌రించి.. దాన్ని మోకాలిలో పాడైన ప్రాంతానికి చేరుస్తాం. ఇక్క‌డ 8 మి.మీ. ప్ల‌గ్స్‌తో గ్రాఫ్ట్ తీసుకుని, అదే కాలికి.. అదే ఎముక‌లో మార్చాం.

సాధార‌ణంగా ఇలా తీసిన చోట మృదులాస్థి మ‌ళ్లీ ఏర్ప‌డేందుకు 6 వారాల స‌మ‌యం ప‌డుతుంది. అప్ప‌టివ‌ర‌కు కాలు మ‌డ‌వ‌చ్చు, చాచ‌వ‌చ్చు గానీ, దానిపై బ‌రువు ప‌డ‌నివ్వ‌కూడ‌దు. అందుకోసం ఆ యువ‌కుడికి ఆరు వారాలు విశ్రాంతి ఇచ్చి, త‌ర్వాత ప‌రీక్షించి చూస్తే అంతా బాగుంది. ఇప్పుడు ఆ యువ‌కుడు చ‌క్క‌గా న‌డుస్తూ, త‌న ప‌నుల‌న్నీ తాను చేసుకుంటున్నాడు అని డాక్ట‌ర్ కిర‌ణ్ కుమార్” వివ‌రించారు. క‌ర్నూలులో ఈ త‌ర‌హా శ‌స్త్రచికిత్స చేయ‌డం ఇదే మొద‌టిసారి.