ఖార్గేకు సోనియా అభినంద‌న‌లు

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించడం పట్ల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన శశి థరూర్ పై మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. మొత్తం 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా… థరూర్ కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లలేదు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తి చేపట్టనుండటం గమనార్హం. మల్లికార్జున ఖర్గే విజయం సాధించడం పట్ల తన కూతురు ప్రియాంకా గాంధీని వెంటబెట్టుకుని సోనియా గాంధీ… నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఖర్గేకు సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. పార్టీకి సంబంధించిన కీలకమైన బాధ్యతల్లో మెరుగ్గా రాణించాలని ఈ సందర్భంగా ఆమె ఖర్గేకు సూచించారు. తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా ఆమె ఖర్గేకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఖర్గే సతీమణికి కూడా సోనియా గాంధీ అభినందనలు తెలిపారు.