కోవిడ్- 19 పై వార్తాకథనాల రచనలో సంయమనాన్ని పాటించాలి

          పత్రికలు టెలివిజన్ మాధ్యమాల లో పనిచేసే వారు కరోనావైరస్ (కోవిడ్- 19)కు సంబంధించిన వార్తా కథనాల ను ఇచ్చేటపుడు సామాజిక బాధ్యత తో మెలగాలని, స్వీయ సంఘావరోధాన్ని (సెల్ఫ్ క్వోరన్టీన్) పాటించడం వంటి జాగ్రత్తలను వీలయినంత వరకు పాటించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రొ. కె. నాగేశ్వర్ అన్నారు.  ప్రజల లో కోవిడ్- 19 పట్ల సరి అయిన అవగాహన ను కలిగించే కృషి లో భాగం గా కేంద్ర సమాచార, ప్రసార శాఖ కు చెందిన పత్రికా సమాచార కార్యాలయం (పి.ఐ.బి.) హైదరాబాద్ విభాగం ఆధ్వర్యం లో శుక్రవారం నాడిక్కడ హైదరాబాద్ లోని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ టవర్స్ లో జర్నలిస్టు చైతన్య  సదస్సు ను నిర్వహించారు.

          ఈ సందర్భం గా నాగేశ్వర్ మాట్లాడుతూ,ప్రస్తుతం కోవిడ్- 19 గా పేరు పెట్టిన నోవల్ కరోనావైరస్ రోజు రోజు కు ప్రబలుతున్న నేపథ్యం లో ప్రజలు వారంతట వారుగా సాటి సమాజం తో కలవకుండా విడి గా ఉండటాన్ని (క్వోరన్టీన్)ను అమలుపరచుకోవడం ఎంతయినా అభిలషణీయమన్నారు.  దీని ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి ని నియంత్రించడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాల కు ప్రజల అండదండలు కూడా లభించి సత్ఫలితాలు వస్తాయేమో గమనించడానికి వీలు ఏర్పడుతుందని ఆయన చెప్పారు. పాత్రికేయులు  ప్రజాహితం కోసం పని చేయాలని, అయితే ప్రజల కు హితం అయినది ఏది అనే విషయాన్ని దృష్టి లో పెట్టుకొని బేరీజు వేసుకోవడం మరింత ముఖ్యమని నాగేశ్వర్ అన్నారు.  ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వార్తలు ఉండకూడదని ఆయన తన ప్రసంగం లో విజ్ఞప్తి చేశారు.  పలు వదంతులు వివిధ సామాజిక మాధ్యమాల లో చక్కర్లు కొట్టే కాలం కాబట్టి, విలేకరులు వార్తాకథనాలను రిపోర్టు చేసేటపుడు ప్రజల కు ఏ సమాచారాన్ని చేరవేయడం మంచిది అన్నది గ్రహించాలని,సంబంధిత నిపుణులు ఒకరికి ముగ్గురిని అడిగి మరీ రూఢిపరచుకొన్న తరువాతనే ఆయా వార్తలను ఫైల్ చేయడం సమంజసమంటూ ఆయన హితవు పలికారు.  జర్నలిస్టులు విధుల ను నిర్వహించే క్రమంలో సాధ్యమైనంతవరకు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, సమాచార-ప్రసార శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న సలహాల ను కూడా గమనిస్తూ,వాటి ని పాటించే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. 

          ఈ కార్యక్రమం లో సి.జి.ఒ. టవర్స్ హెల్త్ సెంటర్ వైద్యురాలు డాక్టర్ మాన్వి మాట్లాడుతూ, ప్రతి ఒక్క వ్యక్తి రెండు చేతుల ను పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం తరచు గా వాటిని సబ్బు నీటి తో కడుగుకుంటూ ఉండడం గాని, లేదా ఆల్కహాల్ బేస్ డ్ హేండ్ శానిటైజర్ ను వాడుతూ ఉండడం గాని చేయాలని,వస్తువులను ముట్టుకున్న చేతులతో కళ్ల ను,ముక్కు ను తాకకూడదని, బయట సమూహాల లో కలసి ప్రయాణించేటపుడు ముఖాని కి మాస్క్ ను ధరించడమో, లేదా ముక్కు ను చేతి రుమాలు తో కప్పుకోవడం వంటి జాగ్రత్త లు తీసుకోవాలని గుర్తుకు తెచ్చారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజూ వెల్లడిస్తున్న తాజా అడ్వయిజరీలు జాతి హితం కోసం ఉద్దేశించినవేనని తెలిపారు.   సమాజం లో ఎవరికి వారు సెల్ఫ్ క్వోరన్టీన్ నియమాలను అనుసరించడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి నిరోధాని కి తోడ్పాటు ను అందించవచ్చన్నారు.  విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు, మాంసాన్ని బాగా ఉడికించి తినాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమం లో పి.ఐ.బి. డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, పి.ఐ.బి. డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి. రత్నాకర్, పి.ఐ.బి. మీడియా &కమ్యూనికేశన్స్ ఆఫీసర్ శ్రీమతి గాయత్రి లతో పాటు వివిధ పత్రికలు, టీవీ చానల్స్ కు చెందిన విలేకరులు పాలుపంచుకొన్నారు.