రేపు భాజ‌పాలోకి బూర న‌ర్స‌య్య గౌడ్

రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బంగారమైందని రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. తన కుటుంబం కోసం తెలంగాణ ప్రజలను కేసీఆర్ బలిచేశాడని ఆరోపించారు. బంగారు తెలంగాణను కేసీఆర్ చోరీ చేశారని ఆరోపించారు. తెలంగాణ కేవలం ఒక కుటుంబం కోసం మాత్రమే ఏర్పడిందన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలన వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. డబుల్ బెడ్ రూమ్, దళిత బంధుతో సహా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రాష్ట్రంలో సరిగా అమలు చేయడం లేదంటూ మండిపడ్డారు. ఏ ఉద్దేశం కోసం రాష్ట్రం ఏర్పడిందో ఆ కలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. మహిళలు, యువకులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

రాష్ట్రాభివృద్ధి కోసం కోసం పాటుపడే ప్రతి ఒక్కరిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని తరుణ్ చుగ్ చెప్పారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. 1969 నాటి ఆశలను కేసీఆర్ వమ్ము చేశారని మండిపడ్డారు. బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బూర నర్సయ్యగౌడ్ కు రాష్ట్రంలో మంచి పేరుందని, డాక్టర్ గా ఉండి రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. రాజకీయాల్లో ఉండి ప్రజలకు చాలా సేవలు చేశారని చెప్పారు. మురికిని క్లీన్ చేయడానికి రాజకీయాల్లో బూర నర్సయ్య గౌడ్ వచ్చారని అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్ ను బూర నర్సయ్య గౌడ్ కలిశారు.

పదవుల కోసం కాదు..
తెలంగాణ ఉద్యమానికి బీజేపీ సీనియర్ నాయకురాలు, దివంగత సుష్మా స్వరాజ్ మద్దతు తెలిపి, పార్లమెంటులోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం తమ గళం వినిపించారని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. తనలాంటి వాళ్లు ఎందరో తెలంగాణ ఉద్యమంలో పని చేశారని, ఇప్పుడు వారంతా దూరంగా ఉన్నారని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎయిమ్స్, కేంద్ర విద్యాలయం, పాస్ పోర్టు కేంద్రం తీసుకొచ్చానని చెప్పారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమకారుల నోర్లు మూయబడ్డాయని చెప్పారు. బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. తాను పదవుల కోసం బీజేపీలోకి వెళ్లడం లేదన్నారు. తనలాంటి చాలామంది తెలంగాణ స్వప్నం కోసం పోరాటాలు చేశారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసమే తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు చెప్పారు. తనతోపాటు భువనగిరి నియోజకవర్గం నుంచి చాలామంది బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు.