మునుగోడు బ‌రిలో 24 మంది

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇవాళ 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు రెండేసి సెట్లు దాఖలు చేయడంతో మొత్తం 24 మంది అభ్యర్థుల తరపున 35 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలు ప్రారంభమైనప్పటి నుండి ఇవాళ్టి వరకు మొత్తం 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథ్ రావు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు రేపు చివరి రోజు. ఇంకొక్క రోజే గడువు ఉండడంతో మరికొంత మంది ఆశావహులు పేరున్న చిన్నాచితక పార్టీల తరపున టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మునుగోడు ఉప ఎన్నికకు రేపు శుక్రవారం ( ఈనెల 14న) నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. లోపాలున్న నామినేషన్లను తిరస్కరించి సక్రమంగా ఉన్న నామినేషన్ల వివరాలను సాయంత్రం ప్రకటిస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 17 వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. వచ్చే నవంబర్ నెల 3వ తేదీన పోలింగ్ జరగనుండగా 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటిస్తారు.