ఉక్రెయిన్‌లో చదివిన వైద్య విద్యార్థులు ఇప్పుడు ఉజ్బెకిస్థాన్‌కు
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చి, అనిశ్చిత పరిస్థితిలో ఉన్న వైద్య విద్యార్థులను ఉజ్బెకిస్థాన్ ఆదుకుంటోంది. భారతీయ వైద్యవిద్యార్థులను తమ దేశంలోని కళాశాలల్లో చేర్చుకుంటామని భారత్‌లో ఉజ్బెకిస్థాన్ రాయబారి దిల్షోద్ అఖతొవ్ తెలిపారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో, ఉక్రెయిన్‌లో చదివిన భారతీయ వైద్య విద్యార్థులకు అక్కడి మెడికల్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎంహెచ్ఈఐ) 2వేల సీట్లు కేటాయించాయి. ఇవన్నీ ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటాయి. ఎంసీఐ, ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం (స్క్రీనింగ్ పరీక్ష నిబంధనలు 2002), ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్షియేట్ – ఎఫ్ఎంజీఎల్ నిబంధనలు 2021కు అనుగుణంగా వ్యవహరిస్తూ, అందుబాటు ఫీజుల్లోనే, భారతీయ ఆహారం అందిస్తూ అక్కడ చదివించడానికి ఉబ్జెకిస్థాన్ అంగీకరించింది. భారతీయ విద్యార్థులకు రెండు రకాల అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యను ఉజ్బెకిస్థాన్ అందిస్తుంది. వాటిలో ఆరేళ్ల ఎండీ డిప్లొమా, 5+1 ఏళ్ల ఎంబీబీఎస్ డిగ్రీ (ఒక ఏడాది ఇంటర్న్‌షిప్) ఉంటాయి. విద్యార్థులు ఎఫ్ఎంజీఈ/నెక్స్ట్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు అక్కడి యూనివర్సిటీలో అత్యాధునిక సదుపాయాలున్నాయి. ప్రభుత్వాస్పత్రులు, క్లినిక్‌లకు అనుబంధంగా పెద్ద సంఖ్యలో టీచింగ్ బెడ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవారిలో 30% భారతీయ, అంతర్జాతీయ ప్రొఫెసర్లే అని ఆయన వివరించారు.
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థులను రాయబారి అభినందించారు. బుఖర్ స్టేట్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్, తాష్కెంట్ మెడికల్ అకాడమీ లాంటి ఉజ్బెకిస్థాన్ ఉన్నత వైద్య విద్యాసంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రొవిజనల్ ప్రవేశ పత్రాలను ఆయన అందించారు.
ఈ కృషిని విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు అభినందించారు. ఎన్ఈఓ డైరెక్టర్, ఉజ్బెకిస్థాన్ వైద్య మంత్రిత్వశాఖలో ఎంహెచ్ఈఐల భారతీయ ప్రతినిధి డాక్టర్ బి. దివ్యరాజ్ రెడ్డి చేతుల మీదుగా రాయబారి దిల్షోద్ అఖతొవ్‌కు ఒకపెద్ద కాన్వాస్ పెయింటింగ్ ఫ్రేమ్ బహూకరించారు.
ఉజ్బెకిస్థాన్-హైదరాబాద్ హెల్త్ కేర్ ఎక్స్ఛేంజ్
తొలుత కొవిడ్, తర్వాత యుద్ధం కారణంగా, ప్రపంచం ఆరోగ్యం, భద్రత, శాంతిపై దృష్టి సారించింది. ఉజ్బెకిస్థాన్ ఈ దిశలో ముందుకు సాగి సురక్షితమైన ప్రాంతంగా ఎదుగుతోంది. నెల రోజుల పాటు సాగిన హెల్త్ కేర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉజ్బెక్ సర్జన్లు మరియు వైద్యులను భారతదేశంలోని ఏఐజీ, యశోద, మేదాంత ఆస్పత్రులకు పంపింది.
ఉజ్బెకిస్థాన్ పర్యటన, తాష్కెంట్ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్
ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు జరుగుతుంది. వివిధ దేశాల అధిపతులు, పర్యాటక మంత్రులు, అంతర్జాతీయ పర్యాటకులు, టూర్ ఆపరేటర్లు/ఏజెన్సీలతో కలిసి ఈ ఫెయిర్‌లో పాల్గొంటున్నారు. కొవిడ్-19 తరువాత, ఉజ్బెకిస్థాన్ పర్యాటక, వాణిజ్య ప్రధాన కేంద్రంగా మారింది.