కేసీఆర్ చేతిలో కోట్ల రూపాయల భూములు
ధరణి పోర్టల్ తెచ్చిన కేసీఆర్ రూ.18 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకున్నడని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ ఉన్న విలువైన భూముల కోసం ధరణి పోర్టల్ తెచ్చిన సీఎం 18 లక్షల ఎకరాలను ఆక్రమించాడని, దేశంలోనే ఇదే అతిపెద్ద భూ స్కాం అని అన్నారు. ధరణి పోర్టల్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని, అవకతవకలపై సీబీఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. అవినీతిపై కేసీఆర్ కొడుకు కేటీఆర్మాట్లాడుతుంటే సిగ్గనిపిస్తోందన్నారు. కేసీఆర్కుటుంబ అవినీతిపై గవర్నర్ ను కలిసి వివరిస్తామని, న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు. 2013లో కేసీఆర్ తన కుటుంబానికి 60 ఎకరాల భూమి ఉన్నదని చెప్పారని, అవినీతి చేశారు కాబట్టే వందల ఎకరాల ఫామ్ హౌస్ లను నిర్మించుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, బీజేపీలో చేరిన వారిని టీఆర్ఎస్ లీడర్లు భయపెడుతున్నారన్నారు. ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే 86 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి సొమ్ముతో తిరుగుతున్నారన్నారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పిస్తారని తనకు నమ్మకం ఉందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశానని, మునుగోడులో తనను ఎదుర్కోలేకే టీఆర్ఎస్లీడర్లు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు చూపించే దమ్ము మాత్రం లేదన్నారు. ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ చాడ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, యన్నం శ్రీనివాస్ రెడ్డి, రాకేశ్రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.