రెండో వ‌న్డేలో భార‌త్ ఘ‌న‌విజ‌యం

ద‌క్షిణాఫ్రికాతో రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్ లో… సఫారీలు నిర్దేశించిన 279 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో అదరగొట్టగా, ఇషాన్ కిషన్ సిక్సర్ల మోత మోగించాడు. అయ్యర్ 111 బంతుల్లో 15 ఫోర్లతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా ఇన్నింగ్స్ కు ఊపొచ్చిందంటే అది ఇషాన్ కిషన్ వల్లే. కిషన్ 84 బంతుల్లోనే 93 పరుగులు చేశాడు. కిషన్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. చివర్లో సంజు శాంసన్ (36 బంతుల్లో 30 నాటౌట్) సమయోచితంగా రాణించడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది.

అంతకుముందు, ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, శుభ్ మాన్ గిల్ 28 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్ 1, వేన్ పార్నెల్ 1, కగిసో రబాడా 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్లు టీమిండియా బ్యాటింగ్ లైనప్ పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే అక్టోబరు 11న ఢిల్లీలో జరగనుంది.