స్మితా సభర్వాల్ వివాదాస్పద ట్వీట్
సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది కాస్తా వివాదాస్పదమవడంతో ఆమెను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే దేశానికి సంబంధించిన అంశం కావడంతో స్మితా సారీ చెబుతూ ట్వీట్ డిలీట్ చేశారు.
దసరా సందర్భంగా స్మితా సబర్వాల్ వివిధ రాష్ట్రాల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని తెలుపుతున్న ఇండియా మ్యాప్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. కానీ స్త్రీ, పురుష నిష్పత్తి మాత్రం రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉందన్న ఈ మ్యాప్ ఆసక్తికరంగా ఉందంటూ ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. స్మితా సభర్వాల్ షేర్ చేసిన మ్యాప్ లో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీలో పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తక్కువ ఉంది. అయితే స్మిత ట్వీట్ చేసిన మ్యాప్లో కశ్మీర్ సంపూర్ణంగా లేదని కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టారు. తన పోస్టుపై విమర్శలు రావడంపై స్పందించిన స్మితా సభర్వాల్ పోస్ట్ డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు.