నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సతీసమేతంగా స్వయంభూ నారసింహుడిని దర్శించుకోనున్నారు. అనంతరం ప్రధానాలయ దివ్యవిమాన గోపురం స్వర్ణతాపడానికి ప్రకటించిన కిలో 16 తులాల బంగారం సమర్పిస్తారు. ఇందుకోసం రోడ్డు మార్గం గుండా ప్రగతిభవన్‌ నుంచి బయల్దేరి యాదాద్రికి చేరుకోనున్నారు. ఉదయం 11.30కి యాదాద్రిలోని ప్రెసిడెన్షియల్ సూట్ కు సీఎం దంపతులు చేరుకుంటారు.

అక్కడి నుంచి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మరికొందరు స్వర్ణతాపడానికి బంగారం విరాళంగా అందజేయనున్నట్లు యాదాద్రి ఈవో ఎన్‌. గీత తెలిపారు. మధ్యాహ్నం ఆలయంలో భోజనం చేసిన తర్వాత 3.30కి సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ యాదాద్రికి వెళ్లడం ఇది 21వ సారి కావడం గమనార్హం.

కాగా, జాతీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. యాదాద్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు నారసింహుడి దర్శించుకోవాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది. దస‌రా పండుగను పురస్కరించుకొని అక్టోబ‌ర్ 5న జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు టీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంతో పాటు పార్టీ ముఖ్య నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం కాబోతుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది.