ర‌స‌కంద‌మ‌యంలో కాంగ్రెస్ అధ్య‌క్ష పోరు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. శుక్రవారం నామినేషన్ల దాఖలుకు తుది గడువు కావడంతో బరిలో ఎవరెవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ మొగ్గుచూపినా ఆయన వర్గం ఎమ్మెల్యే తిరుగుబాటుతో కథ అడ్డం తిరిగింది. గెహ్లాట్ అధ్యక్ష బరి నుంచి తప్పుకునే పరిస్థితి రాగా… చివరకు సీఎం పదవి కూడా దూరం కానుంది.

రాజస్థాన్లో రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారం అశోక్ గెహ్లాట్ కొంపముంచింది. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా సీఎంగా కొనసాగుతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేల తీరు పదవికే ఎసరు పెట్టింది. తాజాగా పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిసిన ఆయన ఎమ్మెల్యేల తిరుగుబాటుకు నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. తాను పార్టీ అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. ఇక రాజస్థాన్ సీఎంగా కొనసాగించడంపై సోనియా గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఉదయం గెహ్లాట్ సోనియాతో భేటీకాగా.. సాయంత్రం సచిన్ పైలెట్ సమావేశమయ్యారు. అయితే ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో చేయనని స్పష్టం చేసినట్లు సమాచారం.

సోనియా మద్దతుపై సస్పెన్స్
20 ఏండ్ల తర్వాత గాంధీ కుటుంబసభ్యులెవరూ బరిలో లేకుండా అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. అయితే నామినేషన్ల దాఖలుకు శుక్రవారంతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్లైన దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ రేపు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ పత్రాలు తీసుకున్న అనంతరం దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ను కలిసి ఆలింగనం చేసుకున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. వారిద్దరూ అధ్యక్ష పదవికి ప్రత్యర్థుల్లా కాకుండా స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నామని శశిథరూర్ స్పష్టం చేశారు. అయితే సోనియా గాంధీ వీరిలో ఒకరికి మద్దతిస్తారా లేక వేరే ఎవరినైనా బరిలో నిలుపుతారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

సచిన్ పైలెట్తో త్వరలో భేటీ
మరోవైపు సోనియాకు అత్యంత సన్నిహితులైన ముకుల్ వాస్నిక్, అంబికా సోని అధ్యక్ష పోరులో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. సోనియా కోరితే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. నెహ్రూ, -గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఖర్గే ఇటీవల పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలిసి, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమమల్ నాథ్ పార్టీ అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఎవరెవరూ పోటీ చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.