పోలీసుల‌కు సిపిఆర్‌పై అవ‌గాహ‌న క‌ల్పించిన కిమ్స్ స‌వీర‌

మానవ శరీరంలో అత్యంత కీలకమైనది హృదయం దాని పదిలంగా ఉంచుకుంటేనే మనిషి మనుగడ కొనసాగుతుందని అన్నారు కిమ్స్ సవీర వైద్యులు. అంతర్జాతీయ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ సవీర ఆస్పత్రికి చెందిన క్రిటికల్ కేర్ విభాగానికి చెందిన డాక్టర్ రవిశంకర్, డాక్టర్ చంద్రశేఖర్ బృందం అత్యవసర సమయాల్లో సీపీఆర్ చేసి ప్రాణాలను ఎలా కాపాడవచ్చని శిక్షణ ఇచ్చారు. రోడ్డు ప్రమాదం, ఇతర ప్రమదాల్లో చిక్కుకున్న వారికి సిపిఆర్‌ ఎలా అందించాలనే అంశాలను జనరల్ మరియు ట్రాఫిక్లో విధులు నిర్వహించే సిబ్బందికి వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్. రవిశంకర్ మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో భాగంగా అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా చిన్న వయసులో గుండెపోటు వచ్చి మరణించిన సంఘటనలను కూడా మనం చూస్తున్నాం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. క్రమపద్దతిలో లేని ఆహార నియమాలు, అధికంగా ఆల్కహాల్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు అధికమవుతున్నాయి. అనంతపురం పట్టణంలో ఇటీవల గమణించిన కేసులలో అధికంగా గుండె సంబంధిత వ్యాధులతో వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా ఒత్తిడి కూడా గుండె సమస్యలకు ప్రధాన కారణంగా మారింది. ఉద్యోగరీత్యా ఒత్తిడితో పని చేయడం వల్ల కూడా ఈ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇది భవిష్యత్తును ఇబ్బంది పెట్టే తరుణం అని చెప్పుకోవాలి. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి శారీరక శ్రమను దూరం పెడుతున్నారు. ఉదయం లేవగానే వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం పెట్టవచ్చు. ముఖ్యంగా శరీరంలో పేరుకపోయిన కొవ్వును కరిగించాలంటే నిత్యం తప్పకుండా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే అతిధిగా జిమ్, వ్యాయామం చేయడం కూడా ప్రాణాలకు ముప్పే.

ఇటీవల సినీ తారాలు, రాజకీయ ప్రముఖులు అధికంగా జిమ్ చేయడం వల్ల మరణించిన సంఘటనలు చూశాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులను ముందుగా గుర్తిస్తే… వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్పా కణిగెల, అడిషనల్ ఎస్పీ ఈ. నాగేంద్రుడు, ట్రాఫిక్ డీఎప్పీ ప్రసాద్ రెడ్డిలు, కిమ్స్ సవీర మెడికల్ సూపరిడెంట్ డాక్టర్. హాబీబ్ రాజా, వైద్యుల బృందం, సిబ్బంది పాల్గొన్నారు.