బ్యాక్‌డోర్ ఉద్యోగ‌మంటూ కోట్లల‌లో మోసం

  • బాధితుల‌కు అండ‌గా యూత్ కాంగ్రెస్ లీడ‌ర్ మ‌ధు

బ్యాక్ డోర్​లో ఐటీ​ జాబ్స్​ ఇప్పిస్తామంటూ ఓ కంపెనీ 150 మందిని ముంచింది. ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులను నమ్మించేందుకు కంపెనీ ప్రతినిధులు మూడు నెలల పాటు ట్రైనింగ్​ ఇవ్వడంతోపాటు నెలకు ఆరు వేల చొప్పున శాలరీ కూడా చెల్లించారు. హైదరాబాద్​లోని కూకట్​పల్లికి చెందిన ప్రతాప్​ కొండాపూర్ జూబ్లీ గార్డెన్​ ఏరియాలో డాన్యోన్ ఐటీ టెక్నాలజీ ప్రైవేట్​లిమిటెడ్​ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఐటీ కంపెనీల్లో బ్యాక్​డోర్స్​ జాబ్స్​ ఇప్పిస్తానంటూ సోషల్​ మీడియాలో ప్రచారం చేశాడు. మల్కాజిగిరికి చెందిన దిలీప్ ఇటీవలే పీజీ పూర్తి చేసి జాబ్​ కోసం చూస్తున్నాడు.

ఈ క్రమంలో దిలీప్​ ఆ ప్రకటన చూసి ఫోన్​ చేశాడు. ఏడాదికి రూ.8.5 లక్షల ప్యాకేజీ ఇప్పిస్తామని, ఇందుకోసం మొదట సర్టిఫికెట్ వెరిఫికేషన్​ టైమ్​లో రూ.20 వేలు, ఆఫర్​ లెటర్​ఇచ్చి లక్షా 70 వేలు వసూలు చేశాడు. మూడు నెలల పాటు ట్రైనింగ్​ఉంటుందని ఆన్​లైన్​లో వీడియోలు పంపించాడు. తర్వాత జీతం ప్రస్తావన తేవడంతో నెలకు ఆరు వేల చొప్పున దిలీప్​కు చెల్లించాడు. ట్రైనింగ్​పూర్తయ్యాక జాబ్​ గురించి అడగ్గా.. రేపు, మాపు అంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో దిలీప్​తోపాటు మోసపోయిన మరి కొందరు ఆఫీస్​కు వెళ్లి అడగ్గా.. కొన్నాళ్లు ఆగాలని చెప్పి పంపించి ఆఫీస్​ను మాదాపూర్​ అయ్యప్ప సొసైటీకి మార్చాడు.

బాధితులంతా కొత్త ఆఫీస్​ అడ్రస్​ తెలుసుకుని వెళ్లగా అక్కడ నర్సింహారెడ్డి అనే వ్యక్తి సదరు కంపెనీని తాను కొనుగోలు చేశానని, అక్టోబర్​ నుంచి జీతాలిస్తామని చెప్పి ఆ తర్వాత ఆయన కూడా స్పందించలేదు. దీంతో ఈ నెల 21న అసెంబ్లీ వద్ద కంపెనీ సీఈఓ ప్రతాప్​ను పట్టుకున్న బాధితులు మాదాపూర్​ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతాప్​ దాదాపు 150 మంది వద్ద నుంచి రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు దృష్టికి వచ్చింది. సుమారు మూడు కోట్ల వరకు మోసం చేసినట్టు చెబుతున్నారు.

ఇప్పటివరకు 10 మంది కంప్లైంట్ ఇచ్చారని, బాధితులు మరింత మంది ఉండొచ్చని పోలీసులు తెలిపారు. యూత్ కాంగ్రెస్ లీడ‌ర్ మ‌ధు ఆధ్వ‌ర్యంలో గ‌త‌లో సైఫాబాద్ పోలీస్ స్టేష‌న్ ఫిర్యాధు చేశారు. కేసు వివ‌రాలు తెలుసుకున్న అక్క‌డి సీఐ మ‌ధాపూర్ స్టేష‌న్‌కు వెళ్లాల‌ని సూచించారు. అయితే ప్రతాప్​కు నోటీసులిచ్చి పంపినట్లు ఇన్​స్పెక్టర్​ రవీంద్ర ప్రసాద్​ తెలిపారు. అయితే కంపెనీ సీఈఓను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రిమాండ్​ చేయకుండా కేవలం నోటీసులిచ్చి పంపించేయడం ఏంటని బాధితులు ప్రశ్నించారు.