టీ20 మ‌న‌దే

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా జయభేరి మోగించింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సూర్యకుమార్ యాదవ్ (69), విరాట్ కోహ్లీ (63) టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. విన్నింగ్ షాట్ కొట్టింది పాండ్యానే. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ కామరాన్ గ్రీన్ 52, టిమ్ డేవిడ్ 54, డేనియల్ సామ్స్ 28, జోష్ ఇంగ్లిస్ 24 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (17) కూడా వెనుదిరగడంతో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో మాజీ కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా రన్ రేట్ ఎక్కడా తగ్గలేదు.

సూర్యకుమార్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేసి హేజెల్ వుడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి కోహ్లీ అర్ధసెంచరీ పూర్తయింది. కోహ్లీకి హార్దిక్ పాండ్యా జతకలవడంతో స్కోరుబోర్డు ముందుకు కదిలింది.

ఆఖర్లో టీమిండియా 6 బంతుల్లో 11 పరుగులు చేయాల్సి వచ్చింది. సామ్స్ వేసిన ఆ ఓవర్లో తొలి బంతికే సిక్స్ కొట్టిన కోహ్లీ, ఆ తర్వాత బంతికే అవుటయ్యాడు. దాంతో 5 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా, దినేశ్ కార్తీక్ బరిలో దిగాడు. ఓ సింగిల్ తీసి పాండ్యాకు స్ట్రయికింగ్ ఇచ్చాడు. ఎంతో కూల్ గా ఆడిన పాండ్యా ఓ బాల్ వేస్ట్ చేసినా, మరుసటి బాల్ కే ఫోర్ కొట్టి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.