షుగ‌ర్ వ్యాధికి డాక్ట‌ర్ స్ర‌వంతి చిట్కాలు మీకోస‌మే

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మధుమేహం ముప్పు పెరుగుతున్నది. దేశంలో టైప్-1 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతోందని ఇటీవల పరిశోధకుల బృందం గుర్తించి, ఈ విషయంలో హెచ్చరించింది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది. 2021 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 8.4 మిలియన్ల మంది టైప్‌-1 మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా వేస్తుండగా.. ఈ సంఖ్య 2040 నాటికి 1.50 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఇందుకోసం డాక్ట‌ర్. స్ర‌వంతి చెబుతున్న చిట్కాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకొండి.

మధుమేహం ముప్పు ఎక్కువగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. డయాబెటిస్‌లో ప్రధానంగా టైప్-1, టైప్-2 అనే రెండు రకాలు ఉన్నాయి. టైప్-1ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అంటారు. దీనిలో రోగికి జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. అధ్యయనం ప్రకారం.. భారతదేశంతో పాటు, అమెరికా, బ్రెజిల్, చైనా, జర్మనీ, స్పెయిన్, కెనడా, యూకే, రష్యా, సౌదీ అరేబియా ఈ మధుమేహం వేగంగా పెరుగుతున్నది.

టైప్‌-1 డయాబెటిస్‌ గుర్తించి తెలుసా ?
టైప్-1 డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. దీంట్లో ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అస్సలే ఉత్పత్తి జరుగదు. ఇన్సులిన్‌ అనేది శరీరంలో ప్రవేశించే గ్లూకోజ్ నుంచి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే హార్మోన్. టైప్-1 డయాబెటిస్‌కు ఇప్పటి వరకు చికిత్స లేదు. ప్రమాదాన్ని తగ్గించడానికి ఇన్సులిన్ ఇవ్వడం, ఆహారం, జీవనశైలిలో స్వల్ప మార్పులు చేయడం ద్వారా కొంత వరకు ప్రమాదాన్ని తగ్గింవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ మధుమేహానికి వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. టైప్-1 మధుమేహం సాధారణంగా బాల్యం, కౌమారదశలో కనిపిస్తుంటుందని వివరించారు.

డయాబెటిస్‌ సోకితే ఏం చేయాలి?
టైప్-1 డయాబెటిస్‌కు చికిత్స లేదు. ముప్పును నివారించేందుకు ఇన్సులిన్ అవసరమని నిపుణులు పేర్కొన్నారు. కాలక్రమేణా మధుమేహం శరీరంలోని ప్రధాన అవయవాలను ప్రభావితం చేస్తాయి. గుండె, రక్త నాళాలు, నరాలు, కళ్లు, మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలను కలిగి ఉండడం అలాంటి అనేక సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇన్సులిన్‌తో పాటు జీవనశైలి మార్పులను చేసుకోవడం ద్వారా అదుపులో ఉంచవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

లక్షణాలు ఇవీ..
టైప్-1 డయాబెటిస్ సాధారణంగా కౌమారదశలో కనిపిస్తుంది. అయినప్పటికీ, ఇది పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. దాని లక్షణాలు చాలా వరకు టైప్-2 డయాబెటిస్‌ను పోలి ఉంటాయి. వాటిని సకాలంలో గుర్తించడం, సరైన చికిత్సను నిర్ధారించడం అవసరం. ఇలాంటి లక్షణాల పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణం కంటే ఎక్కువ దాహం, ఆకలిగా అనిపిస్తూ ఉంటుంది. తరచుగా ఎక్కువగా మూత్రం వస్తుంటుంది. బరువు తగ్గుతుంటారు. చిరాకుగా అనిపిస్తుంటుంది. అలసట, బలహీనంగా అనిపిస్తుంటుంది. అలాగే కంటిచూపు మసకబారుతుంది.