ఏపీ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపిన పేటీఎం

భారతదేశంలో అతి పెద్ద డిజిటల్‌ చెల్లింపులు , ఆర్ధిక సేవల కంపెనీ మరియు క్యుఆర్‌, మొబైల్‌ చెల్లింపుల అగ్రగామి పేటీఎం బ్రాండ్‌ను సొంతం చేసుకున్న ఒన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఓసీఎల్‌) నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖతో ఓ అవగాహన ఒప్పందం(ఎంఓయు) చేసుకుంది. దీనిలో భాగంగా పేటీఎం పీఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) ఉపకరణాలను రాష్ట్ర ప్రభుత్వ ఆక్వాహబ్‌లు మరియు ‘ఫిష్‌ ఆంధ్ర’ పథకం కింద ఏర్పడిన రిటైల్‌ ఔట్‌లెట్ల వద్ద అందుబాటులో ఉంచనుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 100 ఆక్వా హబ్‌లను ఏర్పాటుచేయడం ద్వారా తీర ప్రాంత రాష్ట్రంలో అన్ని ఆక్వా మరియు మెరైన్‌ (సముద్ర)ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించనుంది.

ఈ భాగస్వామ్యంతో , పేటీఎం మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిషర్‌మెన్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏఎఫ్‌సీఓఎఫ్‌), పేటీఎం పీఓఎస్‌ ఉపకరణాలను మొదటి దశలో 2000 ఔట్‌లెట్ల వద్ద అందుబాటులో ఉంచనున్నాయి. పేటీఎం పీఓఎస్‌ ఉపకరణాలను వినియోగించడం వల్ల, రాష్ట్రంలోని వ్యాపారులు తమ వ్యాపారాలను డిజిటలీకరించడంతో పాటుగా తమ వినియోగదారులకు చెల్లింపుల పరంగా సౌకర్యంను పేటీఎం వాలెట్‌, పేటీఎం యుపీఐ, పేటీఎం పోస్ట్‌ పెయిడ్‌, నెట్‌ బ్యాంకింగ్‌,డెబిట్‌ మరియు క్రెడిట్‌ కార్డులు మరియు మరెన్నో మార్గాలలో అందించనుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పశుసంవర్థక, పాల అభివృద్ధి మరియు మత్స్య సంపద శాఖామాత్యులు శ్రీ శీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ‘‘ పేటీఎంతో ఈ భాగస్వామ్యం తో ఆక్వాహబ్‌లు మరియు రిటైలర్‌ నెట్‌వర్క్‌ను డిజిటలీకరించడం సాధ్యం కావడంతో పాటుగా అసంఘటిత రంగంలో సైతం ఆర్థిక సమ్మేళనం సాధ్యమవుతుంది. రాష్ట్రంలో వెలుగులోకి రాని రంగాలలో నీలి ఆర్ధికవ్యవస్ధ కూడా ఒకటి. అసాధారణ వృద్ధి సామర్థ్యం దీనికి ఉంది. ఫిష్‌ ఆంధ్ర తో మేము కేవలం ఉత్పత్తి మాత్రమే పెంచడం కాకుండా ఆక్వా మరియు సముద్ర ఉత్పత్తుల వినియోగాన్ని సైతం రాష్ట్రంలో పెంచడాన్ని లక్ష్యంగా చేసుకున్నాము’’అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పశుసంవర్థక, పాల అభివృద్ధి మరియు మత్స్య సంపద శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీమతి డాక్టర్‌ పూనమ్‌ మాలకొండయ్య, ఐఏఎస్‌ మాట్లాడుతూ ‘‘పేటీఎంతో భాగస్వామ్యం తో ఫిష్‌ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో నూతన వ్యాపారవేత్తలకు తగిన సాధికారితను అందించడంతో పాటుగా వారి వ్యాపారాలను డిజిటలీకరించడంలో కూడా సహాయపడుతుంది. రాష్ట్ర అ
భివృద్ధిలో తోడ్పడే అత్యంత కీలకరంగాలలో మత్స్య రంగం కూడా ఒకటని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు ఫిష్‌ ఆంధ్రతో, ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశపు ఆక్వాకల్చర్‌ రాజధానిగా మలచాలని ప్రభుత్వం కోరుకుంటుంది’’ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ కమిషనర్‌ శ్రీ కె కన్నబాబు, ఐఏఎస్‌ మాట్లాడుతూ ‘‘ ఫిష్‌ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పడిన ఆక్వాహబ్‌లు మరియు రిటైల్‌ ఔట్‌లెట్ల వద్ద వారి సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల పేటీఎంతో మా భాగస్వామ్యం డిజిటల్‌ ఇండియా ప్రచారానికి మరింత తోడ్పాటునందించనుంది. ఫిషరీస్‌ రంగాన్ని డిజిటలీకరించడం వల్ల మరింత మంది ప్రజలను ఈ రంగం నుంచి ప్రధాన స్రవంతి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావచ్చు. ఫిష్‌ ఆంధ్ర కేవలం తాజా చేపలు మరియు సముద్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతుందనే భరోసా కల్పించడం మాత్రమే కాదు, పోషక విలువలతో కూడిన ఆహార వినియోగం సైతం పెంచుతుంది మరియు ఎంతోమందికి ఉపాధి అవకాశాలనూ అందిస్తుందనే భరోసానూ అందిస్తుంది’’ అని అన్నారు.

పేటీఎం వద్ద పేమెంట్స్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా సేవలనందిస్తోన్న అభయ్‌ శర్మ మాట్లాడుతూ ‘‘ ఫిష్‌ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు మద్దతునందిస్తూ వారితో భాగస్వామ్యం చేసుకోవడం గర్వకారణంగా ఉంది. రాష్ట్రంలోని ఆక్వాహబ్‌లు, రిటైల్‌ ఔట్‌లెట్ల వద్ద అత్యంత సౌకర్యవంతంగా డిజిటల్‌ చెల్లింపులను చేయడంలో వినియోగదారులకు పేటీఎం తోడ్పడనుంది. ఈ కార్యక్రమానికి డిజిటల్‌ తోడ్పాటును మా ఉపకరణాలు అందిస్తాయి మరియు 50 కోట్ల భారతీయులను ప్రధాన స్రవంతి ఆర్ధిక వ్యవస్ధలోకి తీసుకురావాలనే మా లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుంది’’ అని అన్నారు.

పేటీఎం ఆల్‌ –ఇన్‌–ఒన్‌ పీఓఎస్‌ తమ వినూత్నమైన ఫీచర్లతో అత్యంత వేగంగా చెల్లింపుల ప్రాసెసింగ్‌ చేయడంలో సహాయపడటంతో పాటుగా అందుబాటు ధరలోని ఫీచర్లనూ అందిస్తుంది. వ్యాపారులు అత్యంత శక్తివంతమైన డ్యాష్‌బోర్డ్‌ సౌకర్యాలను పొందవచ్చు. దీనిద్వారా తమ రోజువారీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి బహుళ స్ధాయి అంశాలనూ వీక్షించవచ్చు. అంతేకాకుండా వారు పలు వ్యాపార సేవలు, ఆర్థిక పరిష్కారాలైనటువంటి ఋణాలు, భీమా, డిజిటల్‌ లెడ్జర్‌నూ పొందవచ్చు. పేటీఎం పీఓఎస్‌ ఉపకరణాలు చెల్లింపులతో పాటుగా లావాదేవీల నిర్థారణ, సర్ధుబాటు సేవలనూ అందిస్తాయి.