ఏపీలో బీజేపీ భారీ యాత్రకు ప్లాన్… 5 వేల సభలు.

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. రాష్ట్రవ్యాప్తంగా మరో యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చేపట్టిన జలం కోసం జనయాత్రకు మంచి స్పందన వచ్చిందని, దీంతో ఈసారి రాష్ట్రవ్యాప్త యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు ఆ పార్టీ నేత, ఎంపీ జీవీఎల్ ప్రకటించారు.

రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మరో యాత్రకు రాష్ట్ర బిజేపీ శ్రీకారం చుట్టబోతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఈ యాత్రకు నాయకత్వం వహిస్తారు. బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో 5 వేల సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఇందులో మోడీ ప్రజా పాలన, జగన్ ప్రజా కంఠక పాలన ను వివరిస్తామని తెలిపారు.

సెప్టెంబరు 17నుండి అక్టోబర్ 2వరకు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు జీవీఎల్ వెల్లడించారు. సెప్టెంబరు 25న తేదీన దీన్ దయాళ్ జయంతి నిర్వహిస్తామన్నారు. జగన్ ప్రజా వ్యతిరేక విధానాల పై బిజెపి అక్టోబర్ ఐదు వరకు కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గం లో బిజెపి సొంతం గా తన శక్తి పెంచుకుంటుందన్నారు. జగన్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బిజెపి బలపడుతుందన్నారు. వీధి వీధిన బిజెపి పేరుతో ప్రజల్లోకి వెళతామన్నారు. బీజేపీతో పొత్తులు ముడి పెడుతూ ఎవరో ఏదో రాస్తే తాము పట్టించుకోబోమని జీవీఎల్ పేర్కొన్నారు.