త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ స్కామ్‌లూ బయటపడతాయి: రాజగోపాల్‌రెడ్డి

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి అమిత్‌షా వచ్చిన మరుసటి రోజే ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ బయటపడిందని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్కామ్‌లూ బయటపడతాయని జోస్యం చెప్పారు. తన రాజీనామాతోనే ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం మునుగోడుకు వచ్చారని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి కోరారు.
మునుగోడు ఉప ఎన్నికకు ఇప్పటికే పార్టీలు సిద్ధమయ్యాయి. నోటిఫికేషన్‌ వెలువడకముందే ప్రచారాన్ని తలపించేలా బహిరంగ సభలు, సమావేశాలు, చేరికల్లో పార్టీలు తలమునకలయ్యాయి. మరో వైపు అధికారులు సైతం మునుగోడు ఉప ఎన్నికకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను ప్రకటించేలోగా ఈవీఎంలను సిద్ధం చేయనున్నారు. జిల్లాలో ఈవీఎంల కొరత ఉండగా, ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు యాదాద్రి జిల్లా నుంచి వాటిని తీసుకోనున్నారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ప్రధాన పార్టీలు భారీ సభలతో తొలి దశ ప్రచారానికి తెర లేపాయి.