వైద్యంతో పాటు చిత్రాల‌ను గీసేస్తోంది

వైద్యం చేయ‌డంతో పాటు ఇత‌ర ఆస‌క్తుల‌పై కూడా వారికి ఆస‌క్తి ఉంటుంది. వైద్యో నారాయణో హరిః అంటారు పెద్దలు. వైద్యవృత్తిలో ఉండటం అంటే రోగులకు ప్రాణదానం చేయడమే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా తమ వృత్తిలో వీరు తలమునకలై ఉంటారు. కానీ, అదే సమయంలో చాలామంది వైద్యుల్లో రెండోకోణం కూడా ఉంటోంది. కొందరు సంగీతంలో ప్రవీణులైతే మరికొందరు అద్భుతమైన చిత్రాలు తమ కుంచె నుంచి జాలువారుస్తారు. కొందరు ప్రకృతి ప్రేమికులైతే ఇంకొందరు శారీరక దారుఢ్యంలో అందరికీ శిక్షణ ఇచ్చి, భావిభారతాన్ని బలంగా చేయాలని చూస్తుంటారు. జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ సందర్భంగా వైద్యవృత్తితో పాటు.. ప్రవృత్తి రీత్యా వేర్వేరు హాబీలను పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్న పలువురు వైద్యుల గురించి తెలుసుకుందాం.

ప్రకృతి రమణీయ వర్ష
డాక్టర్ హసితవర్ష అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్. వైద్యంతో పాటు.. పెయింటింగ్ వేయడం ఈమె హాబీ. ప్రకృతిదృశ్యాలు ఈమె కుంచె నుంచి జాలువారుతాయి. రోజువారీ వృత్తిలో ఉండే ఒత్తిడి నుంచి ఊరట కలిగించడానికి, మనసును ఆహ్లాదంగా ఉంచడానికి పెయింటింగ్ ఎంతో ఉపయోగపడుతుందని డాక్టర్ వర్ష చెబుతారు. ఈమె 17 ఏళ్లుగా గ్రాఫైట్, చార్కోల్ పెన్సిల్ ఆర్ట్, ఆక్రిలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, మ్యూరల్ ఆర్ట్స్, వాల్ పెయింటింగ్స్, రెజీన్ ఆర్ట్స్, రెజీన్ కీచైన్లు, కోస్టర్లు, వాల్క్లాక్లను అందంగా తీర్చిదిద్దడం లాంటివి చేస్తారు. పిల్లల్లో ఈ కళపై ఆసక్తి పెంచేందుకు ఇప్పుడు వాళ్లకు ఆన్లైన్ క్లాసులు కూడా తీసుకుంటున్నారు.