మహిళ కడుపులో రెండు కిలోల భారీ కణితి
అత్యంత భారీ పరిమాణంలో ఫైబ్రాయిడ్ ఉన్న ఓ మహిళకు కిమ్స్ వైద్యులు రోబోటిక్ సర్జరీ చేసి ఊరట కల్పించారు. హైదరాబాద్ నగరానికి చెందిన 45 ఏళ్ల మహిళకి ఇద్దరు పిల్లలు. గత మూడు నెలలుగా ఆమె కొద్దిగా తిన్నా కడుపు నిండిపోయినట్లు ఉండటం, మూత్ర విసర్జన నెమ్మదించడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలో కిమ్స్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించగా.. ఆమెను పరీక్షించినప్పుడు ఆమె కడుపులో 21 x 10 x 18 సెంటీమీటర్ల పరిమాణంలో ఒక భారీ ఫైబ్రాయిడ్ ఉన్నట్లు గుర్తించారు. గర్భాశయ ముఖద్వారం వైపు నుంచి ఉదరంలో పైభాగం వైపు ఆ ఫైబ్రాయిడ్ విస్తరించింది. దాంతో అది అటు గర్భాశయం, ఇటు పొత్తికడుపు వైపు వెళ్లడానికి అడ్డంగా ఉంది. దానికితోడు అది భారీగా ఉండి, ఏకంగా ఏడు నెలల గర్భంతో ఉన్నట్లు కనిపించింది. ఈ ఫైబ్రాయిడ్ ఒత్తిడి కారణంగా రెండు మూత్రపిండాలు, గర్భాశయంలో కూడా వాపు కనిపించింది. ఒకవేళ ఇప్పటికీ ఆమె చికిత్సకు ఆస్పత్రికిరాకుండా, అలాగే వదిలేసినట్లయితే.. మూత్రపిండాల పనితీరు కూడా దారుణంగా దెబ్బతినేదని ఆమెకు శస్త్రచికిత్స చేసిన కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్టు, రోబోటిక్, లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ బిందుప్రియ చెప్పారు.
సాధారణంగా చిన్న పరిమాణం నుంచి మధ్యస్థ పరిమాణం వరకు ఉండే ఫైబ్రాయిడ్లను మినిమల్లీ ఇన్వేసివ్ పద్దతి ద్వారా తొలిగించవచ్చు. కానీ ఇంత పెద్దవాటి విషయంలో ఆపరేషన్ సమయంలో పలు రకాల సమస్యలు వస్తాయని… ఓపెన్ సర్జరీ పద్దతిని అనుసరిస్తారు.
కానీ కిమ్స్ హాస్పిటల్‌లో ఉన్న టెక్నాలజీ దృష్ట్య రోబోటిక్ సర్జరీ విధానాన్ని రోగికి వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాం. అనంతరం వారి అంగీకారంతో రోబోటిక్ సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కేసులో ఫైబ్రాయిడ్ ఉన్న స్థానం దృష్ట్యా శస్త్రచికిత్స చాలా సమస్యాత్మకం అనిపించింది. దాంతో చివరకు రోబోటిక్ సర్జరీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోబో టెక్నాలజీతో ముందుగా ఫైబ్రాయిడ్‌ను గర్భాశయం నుంచి వేరుచేశారు. ఇందుకోసం కడుపు కిందిభాగంలో చిన్న కోత పెట్టారు. తర్వాత అత్యంత సున్నితమైన శస్త్రచికిత్స చేసి ఫైబ్రాయిడ్‌తో పాటు గర్భాశయాన్ని కూడా తొలగించారు. దీన్ని రోబో అసిస్టెడ్ మయోమెక్టమీ విత్ హిస్టరెక్టమీ అంటారు. మే 17న ఈ శస్త్రచికిత్స చేయగా.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో మే 20వ తేదీనే రోగిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
ఈ సందర్భంగా ఫైబ్రాయిడ్లు అంటే ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటన్న విషయాలను కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ యూరోగైనకాలజిస్టు, రోబోటిక్, లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ బిందుప్రియ వివరించారు. మహిళల్లో చాలా మందికి ఉండే పెల్విక్ కణితులనే ఫైబ్రాయిడ్లు అంటారు. సుమారు 40-50% మహిళల్లో ఇవి ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. కానీ 10% మందిలో మాత్రం చికిత్స చేయకుండా వదిలేస్తే అవి భారీగా కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. కుటుంబ చరిత్ర, జన్యుపరమైన కారణాలు, ఊబకాయం, శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి ఎక్కువ కావడం లాంటి కారణాల వల్ల ఇవి ఏర్పడతాయి. సాధారణంగా ఫైబ్రాయిడ్లు గర్భాశయ కండరాల నుంచి ఏర్పడే కణితులు. గర్భాశయంలో అవి ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి సబ్ సెరోసల్ (గర్భాశయ వెలుపలి లైనింగ్ మీద), ఇంట్రా మ్యూరల్ (గర్భాశయ కండరగోడ లోపల), సబ్ మ్యుకోసల్ (గర్భాశయ లోపలి లైనింగ్ మీద). 99% సందర్భాల్లో ఇవి కేన్సర్‌గా మారవు. 5 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నవాటిని చిన్నవని, 5-10 సెంటీమీటర్లుంటే మధ్యస్తమని, 10 సెంటీమీటర్ల కంటే పెద్దవైతే భారీవని అంటారు. వీటివల్ల రుతుక్రమానికి సంబంధించిన సమస్యలేవీ పెద్దగా రావు. కానీ బాగా భారీగా పెరిగితే మాత్రం కడుపులో బరువుగా ఉన్నట్లు అనిపించడం, ఉబ్బినట్లు ఉండటం, మలమూత్ర విసర్జనలకు ఇబ్బంది కలగడం లాంటి సమస్యలు ఉంటాయి.
భారీ ఫైబ్రాయిడ్లకు చికిత్స ఎలా?
చిన్నగా ఉండే ఫైబ్రాయిడ్లను మందులతో లేదా అల్ట్రాసౌండ్/ఎంఆర్ థెరపీలతో నయం చేసే అవకాశం ఉన్నా, పెద్దవాటిని మాత్రం శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిందే. ఇందులో మయోమెక్టమీ అంటే కేవలం ఫైబ్రాయిడ్లను మాత్రమే తొలగిస్తారు. అదే హిస్టరెక్టమీ అంటే ఫైబ్రాయిడ్లతోపాటు గర్భాశయాన్నీ తొలగిస్తారు. రోగి పరిస్థితిని బట్టి, వాళ్లు మళ్లీ పిల్లల్ని కనాలనుకుంటున్నారా.. లేదా అన్నదాన్ని బట్టి ఇది ఆధారపడుతుంది. ఉదరం మీద పెద్ద కోత పెట్టి చేసేవాటిని ఓపెన్ శస్త్రచికిత్సలు అంటారు. అయితే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో.. లాప్రోస్కొపీ లేదా రోబోటిక్ సర్జరీ ద్వారా పెద్దవాటినీ తొలగిస్తున్నారు. దీనివల్ల రోగి వేగంగా కోలుకోవడంతో పాటు నొప్పి తక్కువగా ఉంటుంది, పొట్టమీద మచ్చలు పడకుండా ఉంటాయి.
పెద్దవాటిని నివారించడం సాధ్యమేనా?
ఫైబ్రాయిడ్లు సాధారణంగా నెమ్మదిగా పెరుగుతుంటాయి. అందువల్ల అవి పెద్దవి కావడానికి చాలా సమయం పడుతుంది. మహిళలు ఎప్పటికప్పుడు గైనకాలజిస్టులతో తగిన పరీక్షలు చేయించుకుంటే, వాటిని చిన్నవిగా ఉన్నప్పుడే గుర్తించి మందులతో కూడా నయం చేసే అవకాశం ఉంటుంది. పెద్ద ఫ్రైబ్రాయిడ్లను తొలగించేటప్పుడు చేసే శస్త్రచికిత్సలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అతిగా రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, చుట్టుపక్కల భాగాలకు గాయం కావడం, రక్తం ఎక్కించాల్సి అవసరం రావడం వంటిగ సమస్యసలు తలెత్తవచ్చు. ఆధునికి టెక్నాలజీ దృష్ట్యా పెద్ద ఫ్రైబ్రాయిడ్లను కూడా సర్జన్ నైపుణ్యం బట్టి మినిమల్లీ ఇన్వేసివ్ పద్దతి (లాపరోస్కోపీ / రోబోటిక్) ద్వారా ఆపరేషన్ చేయవచ్చని కిమ్స్ వైద్యురాలు బిందుప్రియ తెలిపారు.