కేన్సర్ వచ్చే అవకాశం ఉన్న మహిళకు కిమ్స్ ఐకాన్‌లో అరుదైన శస్త్రచికిత్సలు
గతంలో ఒకసారి రొమ్ము కేన్సర్ వచ్చి, తర్వాత జన్యు పరీక్షల్లో మరోసారి భవిష్యత్తులో కేన్సర్ వచ్చే అవకాశం ఉన్న మహిళకు విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఒకేసారి పలు రకాల శస్త్రచికిత్సలు చేసి ఆమెకు ఊరట కల్పించారు. గాజువాక ప్రాంతానికి చెందిన 47 ఏళ్ల గృహిణికి ముగ్గురు పిల్లలున్నారు. ఐదేళ్ల క్రితమే ఆమెకు మెనోపాజ్ వచ్చి, రుతుస్రావాలు ఆగిపోయాయి. 2018లో ఒకసారి కుడివైపు రొమ్ముకేన్సర్ రావడంతో శస్త్రచికిత్స చేసి ఆ రొమ్మును తొలగించాల్సి వచ్చింది. తర్వాత ఆమె ముందుజాగ్రత్తగా జన్యుపరీక్షలు చేయించుకున్నారు. అందులో బ్రాకా1 (బీఆర్‌సీఏ జీన్1) అనేది పాజిటివ్ అని వచ్చింది. అలా వచ్చినవారికి మరోసారి ఎప్పుడైనా రెండోవైపు రొమ్ము కేన్సర్ గానీ, గర్భాశయ కేన్సర్ గానీ, అండాశయ కేన్సర్ గానీ వచ్చేందుకు అవకాశాలుంటాయి. దాంతో ఆమె విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. మరోసారి కేన్సర్ రాకుండా ఉండేందుకు తాను ఎడమవైపు రొమ్ము కూడా తొలగించుకుంటానని, దాంతోపాటు గర్భాశయం, అండాశయం కూడా తొలగించాలని కోరారు. అయితే, రెండువైపులా రొమ్ములు తొలగించాల్సి రావడంతో, ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాటి రీకన్‌స్ట్రక్షన్‌కు అవకాశం ఉంటుందని తెలిసి అలా చేయాలని ఆమె కోరారు. ముందుగా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గైనకాలజిస్టు, గైనకలాజికల్ ఆంకాలజిస్టు డాక్టర్ డి.లీల నేతృత్వంలో ఆమెకు ముందుజాగ్రత్తగా గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగించారు. దానివల్ల ఆ ప్రాంతాల్లో ఆమెకు కేన్సర్ వచ్చే అవకాశం ఉండదు. ఆ తర్వాత ఇదే ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ పీఆర్‌కే ప్రసాద్ నేతృత్వంలో ఎడమవైపు రొమ్ము కూడా తొలగించడంతో పాటు.. రెండువైపులా కృత్రిమ రొమ్ములను అమర్చారు. దానివల్ల ఆమెకు రెండోసారి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోవడంతో పాటు.. చూసేందుకు సాధారణంగానే కనిపిస్తారు. సాధారణ కేన్సర్ రోగుల్లో 5-15% మందికి మాత్రమే ఇలా రెండోసారి జన్యుపరమైన కారణాల వల్ల అదే భాగానికి లేదా ఇతర భాగాలకు కేన్సర్ సోకే అవకాశం ఉంటుంది. అయితే రెండోసారి వచ్చినప్పుడు అది బాగా తీవ్రతరంగా ఉండే ప్రమాదం ఉండటంతో దాన్ని నివారించడానికి ఇలా ముందస్తుగా శస్త్రచికిత్సలు చేయించుకుంటారు. ఇలాంటి శస్త్రచికిత్సలు చేయాలంటే ఒకేచోట గైనకాలజిస్టులు, ఆంకాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు.. ఇలా బహుళ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు అవసరం అవుతారు. కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో వారందరూ ఒకేచోట అందుబాటులో ఉండటం, అత్యాధునిక వైద్య సదుపాయాలు కూడా ఉండటంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆ మహిళకు ఊరట కల్పించగలిగారు. ఎడమవైపు తొలగించిన రొమ్ము, గర్భాశయం, అండాశయాలను మళ్లీ బయాప్సీకి పంపగా, వాటిలో కేన్సర్ లక్షణాలు ఏమీ కనిపించలేదు. అన్ని శస్త్రచికిత్సలూ పూర్తిగా విజయవంతం కావడం, ఆ మహిళ ఆరోగ్యకరంగా ఉండటంతో ఆమెను డిశ్ఛార్జి చేసినట్లు డాక్టర్ డి.లీల, డాక్టర్ పీఆర్‌కే ప్రసాద్ తెలిపారు.