9 రోజుల శిశువుకు కిమ్స్ సవీరలో విజయవంతంగా శస్త్రచికిత్స
- పుట్టకముందే తలెత్తిన లోపాన్ని సరిచేసిన వైద్యులు
- అనంతపురం కిమ్స్ పీడియాట్రిక్ న్యూరోసర్జరీ విభాగం ఘనత
గర్భం దాల్చకముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. పుట్టే పిల్లలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారం రోజుల వయసున్న శిశువు నవ్వినా, దగ్గినా, గట్టిగా ఏడ్చినా వెంటనే నియంత్రణ లేకుండా మలవిసర్జన అయిపోవడం అరుదైన సమస్య. దీన్ని తల్లిదండ్రులు కూడా సాధారణంగా గుర్తించలేరు. సరైన సమయానికి చికిత్స చేయించకపోతే ఇలాంటి సమస్యలు జీవితాంతం వారిని వెంటాడే ప్రమాదం ఉంటుంది. అనంతపురానికి చెందిన ఇలాంటి అరుదైన కేసులో కిమ్స్ ఆస్పత్రి న్యూరోసర్జరీ బృందం విజయవంతంగా చికిత్స చేసి, లోపాన్ని సవరించింది. ఆ వివరాలను ఆస్పత్రికి చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ రామ్మోహన్ నాయక్, డాక్టర్. రోహిత్ రెడ్డిలు వివరించారు.
“వారం రోజుల వయసున్న శిశువుకు వెన్నెముక ప్రాంతంలో చర్మం పారదర్శకంగా అవుతోందని, లోపల ఏముందో కనపడుతోందని తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో వాపు కూడా ఉంది. అది పుట్టినప్పుడే ఉన్నా, అదే తగ్గిపోతుందనుకుని వైద్యులకు చూపించలేదు. కానీ లోపల ఏముందో కనిపిస్తోందని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పుడు ఆ శిశువుకు మెనింగోమైలోసిల్ అనే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ ఉన్నట్లు గుర్తించాం. ఇలాంటివి ఉన్నప్పుడు లోపల ఆ నరాలు గడ్డలోకి వచ్చేసి చర్మం కింది భాగంలో అతుక్కుపోయి ఉంది. వాళ్లు ఏమాత్రం కాస్త అలసటకు గురైనా.. అంటే నవ్వినప్పుడు, దగ్గినా, ఏడ్చినా తెలియకుండానే మలవిసర్జన అయిపోతుంది. దానికితోడు వెన్నెముక దిగువభాగంలో వాపు ఎక్కువగా ఉంది. మెనింగోమైలిసిల్ సమస్య గురించి శిశువు తల్లిదండ్రులకు తెలియజేసి, శస్త్రచికిత్స చేసినా అది సరి అవుతుందో లేదో చెప్పలేమని వివరించి అప్పుడు శిశువు పుట్టిన తొమ్మిదో రోజున శస్త్రచికిత్స చేశాం. తర్వాత సుమారు నెలరోజుల వయసున్న ఆ శిశువును ఫాలోఅప్ కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా నయమైంది. రెండు కాళ్లూ బాగున్నాయి. మలవిసర్జన కూడా నియంత్రణ లేకుండా అవ్వడం లేదు. దాంతో సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్లు చెప్పగలిగాం.
సాధారణంగా చిన్నవయసులోనే పెళ్లి అయితే తగుమొత్తంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. గర్భం దాల్చకముందే తల్లికి ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే.. పిల్లకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ కేసులో ఏడోనెల వచ్చేవరకూ ఆమెకు తాను గర్భం దాల్చినట్లే తెలియదు. దాంతో స్కాన్లు ఏమీ చేయించుకోలేదు, ఫోలిక్ యాసిడ్ కూడా తీసుకోలేదు. గర్భం దాల్చిన తొలి 28 రోజుల్లోనే న్యూరల్ ట్యూబ్ డిఫెక్టులు వస్తాయి. తల్లిదండ్రులిద్దరూ రోజుకూలీలు కావడం, వారికి అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరిగింది. నగరాల్లో పోషకాహారంపై దృష్టి ఉంటుంది కాబట్టి, వాళ్ల శరీరంలో ఫోలిక్ యాసిడ్ తగినంతగా ఉంటుంది. అందువల్ల సాధారణంగా ఇలాంటి లోపాలు రావు. పైపెచ్చు గర్భం దాల్చినా ఆ విషయం కూడా వెంటనే తెలిసే అవకాశం ఉంటుంది.కానీ గ్రామాల్లో అవగాహన లోపం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల గర్భస్థ శిశువులకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో పాలకూర, చేపల్లాంటి వాటిల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. సమతుల ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు” అని డాక్టర్ రామ్మోహన్ నాయక్, డాక్టర్. రోహిత్ రెడ్డిలు వివరించారు.
ఈ శస్త్రచికిత్సలో న్యూరోసర్జన్లు డాక్టర్ రోహిత్ రెడ్డి, డాక్టర్ రామ్మోహన్ నాయక్, పీడియాట్రీషియన్ డాక్టర్ మహేష్, ఎనస్థిటిస్టులు డాక్టర్ చంద్రశేఖర్, రవిశంకర్ పాల్గొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో ఇంతకుముందు ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తే బెంగళూరు లేదా హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అనంతపురంలోని కిమ్స్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ న్యూరోసర్జరీ కేసులకు విజయవంతంగా చికిత్సలు చేస్తున్నారు. పీడియాట్రిక్ బ్రెయిన్ ట్యూమర్లు ప్రొసీజర్లు కూడా సులభంగా చేస్తున్నారు.