మహిళ కడుపులోంచి 3 కిలోల భారీ ఫైబ్రాయిడ్‌ను తీసిన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు
నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన ఎస్ఎల్‌జీ ఆస్పత్రి వైద్యులు 30 ఏళ్ల వయసున్న మహిళ ప్రాణాలు కాపాడేందుకు ఆమె ఉదరం నుంచి ఏకంగా 3 కిలోల బరువున్న భారీ ఫైబ్రాయిడ్‌ను శస్త్రచికిత్స చేసి తొలగించారు. 30×28 సెంటీమీటర్ల పరిమాణంతో పూర్తిగా ఎదిగిన బిడ్డ స్థాయిలో ఈ ఫైబ్రాయిడ్ ఉంది. ప్రపంచంలోని ఈ ప్రాంతంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించిన అతిపెద్ద ఫైబ్రాయిడ్లలో ఇదొకటి.
ఇటీవలే అమెరికా నుంచి భారతదేశానికి తిరిగొచ్చారు ఓ గృహిణి. తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ ఏప్రిల్ 18న ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో చేరారు. తగిన పరీక్షలు చేసిన తర్వాత గర్భాశయంలో పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నట్లు తెలిసింది. దానివల్లే తీవ్రమైన కడుపునొప్పితో పాటు ఆమెకు శ్వాసపరమైన ఇబ్బందులు కూడా తలెత్తాయి. ఈ భారీ ఫైబ్రాయిడ్ వల్ల మూత్రకోశం, గర్భాశయం, పేగులు, డయాఫ్రం కూడా నొక్కుకుపోతున్నాయి. దీనివల్ల ఆమె ఊపిరితిత్తుల వద్ద ఉండాల్సిన ఖాళీ తగ్గి శ్వాసపరమైన సమస్యలు తలెత్తాయి.
ఈ పరిస్థితి గురించి ఎస్ఎల్‌జీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ గైనకాలజిస్టు, లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ శిల్పా గట్టా మాట్లాడుతూ, “సుమారు మూడు సంవత్సరాల క్రితం అమెరికాలో ఆమెకు సిజేరియన్ జరిగింది. కానీ, అప్పుడు ఫైబ్రాయిడ్‌ను గుర్తించలేదు. ఇప్పుడు ఫైబ్రాయిడ్ పరిమాణం భారీగా ఉండటంతో, పలు విభాగాలకు చెందిన వైద్యనిపుణులు శస్త్రచికిత్సలో ఉండాల్సి వచ్చింది. వారిలో గైనకాలజిస్టులు, యూరాలజిస్టులు, ఎనస్థీషియాలజిస్టులు ఉన్నారు. బాధితురాలి వయసు తక్కువ కావడంతో, ఇంత పెద్ద ఫైబ్రాయిడ్‌ను తీసేందుకు శస్త్రచికిత్స చేస్తున్నా, గర్భాశయం ఏమాత్రం దెబ్బతినకుండా చూసుకోవడం చాలా పెద్ద సవాలుగా మారింది. కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ శివరాజ్ మనోహరన్ ముందుగా సిస్టోస్కొపీ చేసి, యూరేటెరిక్ స్టెంట్లు వేశారు. మూత్రకోశం కొంత దెబ్బతినడాన్ని శస్త్రచికిత్సలో గమనించారు. కుడివైపు అడ్డంకులు ఉండటంతో కుడి మూత్రపిండం కూడా కొంత వాచింది” అని చెప్పారు.
“ఈ ఫైబ్రాయిడ్ చాలా పెద్ద పరిమాణంలో ఉండటంతో, శస్త్రచికిత్సకు దాదాపు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. ఎక్కువ రక్తస్రావం కాకుండా ఉండేలా చూసేందుకు అత్యంత అప్రమత్తంగా, నిశితంగా చేయాల్సి వచ్చింది. శస్త్రచికిత్స తర్వాత డాక్టర్ సుహాసిని నేతృత్వంలోని క్రిటికల్ కేర్ బృందం ఆమెను అత్యంత జాగ్రత్తగా చూసుకున్నారు. దాంతో రోగి వేగంగా కోలుకుని, శస్త్రచికిత్స అయిన మూడు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు” అని కన్సల్టెంట్ గైనకాలజిస్టు, లాప్రోస్కొపిక్ సర్జన్ డాక్టర్ శిరీష ముళ్లమూరి తెలిపారు.
ఇంత సంక్లిష్టమైన కేసులో విజయవంతంగా చికిత్స చేసిన బృందంలో గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్ బృందానికి చెందిన కన్సల్టెంట్లు డాక్టర్ శిల్పా గట్టా, డాక్టర్ శిరీష ముళ్లమూరి, కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ శివరాజ్ మనోహరన్, ఎనస్థీషియాలజిస్టులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ తేజశ్రీ, డాక్టర్ సిరి భవాని తదితరులు ఉన్నారు.