ఏపీ నేత‌ల‌కు కేటీఆర్ భ‌య‌ప‌డ్డాడా ?

ఇటీవ‌ల తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఏపీ రాష్ట్రంలో క‌రెంట్‌, నీళ్లు, రోడ్లు స‌రిగా లేవంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఏపీలోని చిన్న స్థాయి నేత‌ల నుండి మంత్రుల వ‌ర‌కు త‌మ‌దైన ప‌ద్ద‌తిలో కేటీఆర్‌కి బుద్ధి చెప్పారు. మా అభివృద్ధి చూడాలంటే 4 బ‌స్సులు కాదు.. 400 బ‌స్సుల‌లో రావాల‌ని సూచించారు. ఇక మంత్రులైతే… తీవ్ర ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు.

దీంతో ఏపీ రాష్ట్రం పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించి కలకలం రేపిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎట్టకేలకు స్పందించారు. పక్క రాష్ట్రం లో కరెంటు ఉండడం లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో గత రాత్రి ట్విట్టర్ ద్వారా కేటీఆర్ వివరణ ఇచ్చారు.

తన వ్యాఖ్యల వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఏపీలోని తన స్నేహితులను తెలియకుండానే తన వ్యాఖ్యలతో కొంత బాధ పెట్టి ఉండొచ్చన్నారు. అయితే, ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, అన్యాపదేశంగానే అవి తన నోటి వెంట వచ్చాయని అన్నారు. ఏపీ సీఎం జగన్‌ను తన సోదరుడిగా భావిస్తానని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్టు కేటీఆర్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.