కుళ్లిన పెద్దపేగు, మహిళ ప్రాణాలు కాపాడిన డాక్టర్ వసీమ్ హసన్ రాజా షేక్
- 9 నెలల గర్భిణికి పుట్టుకతోనే సమస్య
- తల్లికి గ్యాంగ్రిన్ వల్ల మరణించిన శిశువు
- ఆలస్యమైతే తల్లి ప్రాణాలకూ ప్రమాదం
పుట్టుకతోనే పేగులు మెలికపడి, దాని కారణంగా రక్తప్రసరణ ఆగిపోయి గ్యాంగ్రిన్ ఏర్పడి.. చివరకు గర్భస్త శిశువు మరణానికి దారితీసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. మరికొంత ఆలస్యం చేస్తే తల్లి ప్రాణానికి కూడా ముప్పు వాటిల్లేది. కానీ, సమయానికి ఆమెను కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్స్‌కి తీసుకురావడంతో అక్కడ అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి, ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు ఆస్పత్రిలోని కన్సల్టెంట్ లాప్రోస్కొపిక్, బేరియాట్రిక్, జనరల్ సర్జన్ డాక్టర్ వసీమ్ హసన్ రజా షేక్ ఇలా వివరించారు.
“కర్నూలు జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన ఓ రైతు కుటుంబంలోని 24 ఏళ్ల మహిళ 9 నెలల గర్భంతో ఉంది. ఒకరోజు ఆమెకు ఉన్నట్టుండి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు ఉండటంతో ఆస్పరి పీహెచ్‌సీకి వెళ్లింది. మందులు వేసినా తగ్గకపోవడం, లోపల ఉన్న శిశువు కదలికలు తగ్గినట్లు గుర్తించడంతో అక్కడి వైద్యులు పెద్దాసుపత్రికి వెళ్లాలని సూచించారు. సమీప పట్టణమైన ఆదోనికి తీసుకెళ్లగా, లోపల శిశువు చనిపోయినట్లు గుర్తించి.. సిజేరియన్ చేసి శిశువును తీసేశారు. కానీ, ఆ శస్త్రచికిత్స సమయంలో లోపల పేగులు నల్లగా అయినట్లు గుర్తించి, గ్యాంగ్రిన్ వచ్చిందని, కర్నూలు తీసుకెళ్లాలని చెప్పారు.
కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్స్‌కి తీసుకొచ్చిన తర్వాత చూస్తే, ఆమెకు పెద్దపేగులు పుట్టుకతోనే సాధారణ స్థానంలో లేకుండా అటువి ఇటు ఉన్నాయి. దాన్ని మాల్ రొటేషన్ అంటారు. సాధారణంగా స్థిరంగా ఉండాల్సిన పెద్ద పేగులు వదులుగా అయ్యాయి. గర్భంలో శిశువు పెరిగేకొద్దీ సమస్య ఎక్కువై, సీకల్ వాల్వులస్ అనే సమస్య వచ్చింది. అంటే పేగులు మెలితిరిగిపోవడం వల్ల మలవిసర్జనకు ఇబ్బంది అయ్యింది. చివరకు రక్తసరఫరా ఆగిపోవడం వల్ల గ్యాంగ్రిన్ అయిపోయింది. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయినరోజున అది పెరిగిపోయి, గ్యాంగ్రిన్ ఏర్పడి, దాన్నుంచి వెలువడిన విషపదార్థాల వల్ల లోపలున్న శిశువు చనిపోయింది. ఈ సమస్యను గుర్తించిన మేము ఆపరేషన్ చేసి, పెద్దపేగుల్లో దాదాపు 40-45 సెంటీమీటర్ల భాగం తీసేశాం. ఇవి మొత్తం 2 మీటర్ల వరకు ఉంటాయి. ప్రస్తుతానికి చిన్నపేగులను కొంత బయటకు తీసుకొచ్చి, ఇలియాస్టమీ చేశాం. అందులోకే మల విసర్జన అవుతుంది. ఆమె పూర్తిగా కోలుకుని, బలం పుంజుకున్న తర్వాత సాధారణంగా 6 వారాల నుంచి 3 నెలల మధ్యలో మరోసారి శస్త్రచికిత్స చేసి, పేగులన్నింటినీ యథాస్థానంలో పెడతాం. అప్పుడు ఇక మలవిసర్జన కూడా సాధారణంగానే అవుతుంది. పేగులు పగిలిపోయి ఉంటే సమస్య తీవ్రతరమై, రోగి చనిపోయే ప్రమాదం ఉండేది. వెంటనే శస్త్రచికిత్స చేయడం వల్ల ప్రాణాపాయం తప్పింది. మొత్తం శస్త్రచికిత్సకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. నాలుగైదు రోజులు ఆస్పత్రిలో ఉన్న తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఆమె.. తన సాధారణ పనులన్నీ చేసుకోగలుగుతోంది. రెండో శస్త్రచికిత్స కూడా అయిన తర్వాత ఆమె సాధారణ స్థితికి చేరుకుంటుంది” అని డాక్టర్ వసీమ్ హసన్ రజా షేక్ వివరించారు. అలాగే ప్రతి గర్భవతి కూడా తప్పనిసరిగా అనుభవం కలిగిన రేడియాలజిస్ట్ సంప్రదించి స్కానింగ్‌లు తప్పని సరిగా చేయించుకోవాలి. ఈ సర్జరీకి అనస్థీషియా డాక్టర్. విజయసాయి మరియు ఐసియు, ఓటీ సిబ్బంది సహాయం అందించారు.