యువతకు నైపుణ్య శిక్షణ
భారతదేశంలో బాలల సంరక్షణ కోసం స్వతంత్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ విలేజస్ ఆఫ్ ఇండియా. ఎస్‌ఓఎస్ తన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా దేశంలో 1,820 మందికి పైగా యువతకు ఉత్పాదక ఉపాధి అవకాశాలు కల్పించింది. హైదరాబాద్‌లో 497 మంది మహిళలు సహ మొత్తం 970 మంది యువతకు డిజిటల్ మార్కెటింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంజినీరింగ్, నర్సింగ్, న్యూట్రిషన్, హోటల్ మేనేజ్‌మెంట్, బ్యూటీ అసిస్టెంట్, నెట్‌వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ వంటి కొన్ని రంగాల్లో వారికి శిక్షణ అందించడం జరిగింది.
ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోతలు, మార్కెట్‌లో వస్తున్న కొత్త ఉద్యోగాల కారణంగా నైపుణ్యం, పునర్ నైపుణ్యం, నైపుణ్యాభివృద్ధి అన్నది మహమ్మారి తదనంతర కాలంలో చాలా కీలకంగా మారుతోంది. ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ విలేజస్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సంరక్షణ పరిష్కారాల్లో చదువు, నైపుణ్యం అన్నవి ముఖ్యంగా నిలుస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రత్యేకమైన పరిష్కారాలు సంస్థ రూపొందిస్తోంది. భారతదేశంలో జనాభాపరంగా ఉన్న అవసరాల దృష్ట్యా ఇక్కడ చర్యలు ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువతలో అవసరమైన నైపుణ్యాలు పెంపొందించేందుకు ఈ స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు నెలకొల్పింది. వారికి ఆర్థిక సాయమందిస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు, మరింత పెంపొందించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ చర్యల ద్వారా వారికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు మెరుగైన ఆదాయమూ అందుతోంది.
ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ విలేజస్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ శ్రీ సుమంత ఖర్ మాట్లాడుతూ, “మహమ్మారి కారణంగా నిరుద్యోగ రేటు బాగా పెరిగిపోయింది ముఖ్యంగా అణగారిన వర్గాలపై ఈ ప్రభావం చాలా ఉంది. వ్యక్తులకు ముఖ్యంగా, కుటుంబ అలనాపాలన చూసే వారికి తగిన శిక్షణ అందించి సాధికారత కల్పించాలని మేము భావించాం. వారిలో నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా వోకేషనల్ శిక్షణా కేంద్రాల ద్వారా వారికి నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం. దీనికి ఊహించని స్పందన లబించింది. 85-90% కి పైగా యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి. మారుతున్న పని వాతావరణానికి అనుగుణంగా యువతకు శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు మాకు ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ల నుంచి నిరంతరం మద్దతు అందుతోంది” అన్నారు.
నైపుణ్య కార్యక్రమం ద్వారా లబ్దిపొందిన యువతి దీప్తి మాట్లాడుతూ, “నాకు 14 ఏళ్ల వయస్సున్నప్పుడు మా నాన్న తీవ్రమైన అనారోగ్యం బారిన పడి మరణించారు. ఆయన మరణం కారణంగా మా కుటుంబం తీవ్ర సంక్షోభంలో పడిపోయింది, నేను నా చదువు కొనసాగించలేకపోయాను. నాకు ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ విలేజస్ అందిస్తున్న నైపుణ్య కార్యక్రమం గురించి తెలిసింది. తగిన పరిశీలన జరిపిన తర్వాత ఈ సంస్థ ఐటీఈఎస్ –బీపీఓ కోర్సు కోసం నన్ను టీడబ్ల్యూజీ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్‌లో గర్ల్స్ ఐటీ సెక్షన్‌లో నన్ను చేర్చుకుంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఒక బీపీఓ సంస్థలో నాకు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగాన్ని లభించింది. థ్యాంక్స్ టూ ఎస్‌ఓఎస్ చిల్డ్రన్స్ విలేజస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నేను నా కుటుంబానికి అండగా నిలవడమే కాదు మా చెల్లి చదువు ఖర్చులు కూడా భరిస్తున్నాను” అన్నారు.