పిట్టల దొర కేసీఆర్ పనైపోయింది : బండి సంజయ్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని.. ఆయన మాటలను, హామీలను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తన పనైపోయిందని భావించిన కేసీఆర్.. ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళుతూ అక్కడి ప్రజలకు ఆర్థిక సాయం పేరుతో కొత్త డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఈ ఓట్లను చీల్చడం ద్వారా లబ్ది పొందాలని కేసీఆర్ నాయకత్వంలో కొందరు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా ఈసారి ప్రజలు మాత్రం బీజేపీకి అధికారం ఇవ్వాలనే డిసైడ్ అయ్యారని చెప్పారు. ఎన్నికలెప్పుడొచ్చినా రాష్ట్రంలో కాషాయ జెండాను ఎగరేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం పెద్దకొర్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన దాదాపు 25 మంది నాయకులు బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కుమార్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. పెద్దకొర్ల గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఎర్రజెండాతో కొట్లాడి ఆ గ్రామాన్ని మొత్తం కాషాయంగా మార్చిన నేతలందరికీ అభినందనలు తెలియజేశారు. భారతీయ జెండాను చూసి గర్వించే స్థాయిలో నరేంద్రమోడీ పాలన కొనసాగుతోందని… పాకిస్తాన్ సహా విదేశీయులు సైతం భారత పతాకం నీడలో రక్షణ పొందుతుండటం గర్వకారణమని చెప్పారు.