40 రోజులకు పైగా కొవిడ్‌పై పోరాడి గెలిచిన 70 ఏళ్ల వృద్ధుడు
కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకి, 40 రోజులకు పైగా దాంతో పోరాడిన వృద్ధుడికి పూర్తిగా నయం చేసినట్లు నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకైటన సెంచురీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
బోయిన్‌పల్లికి చెందిన సి.ఎన్. మూర్తి తనకు మూడు రోజులుగా జ్వరం ఉందంటూ ఫిబ్రవరి 24న సెంచురీ ఆస్పత్రిలోని కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ అరుణ్‌కుమార్‌ను సంప్రదించారు. ముందుగా జనవరి 20న జ్వరంతో పాటు దగ్గు, గొంతునొప్పి కూడా వచ్చాయి. జనవరి 22న ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష చేయించగా ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. అప్పటినుంచి ఆయనకు లక్షణాలను బట్టి చికిత్స అందించసాగారు. అయితే, కొన్ని రోజుల తర్వాత కూడా ఆయనకు కొవిడ్-19 పాజిటివ్‌గానే ఉంది. అప్పటికే బాగా నలతగా కనిపించడంతో పాటు, 5 కిలోల బరువు కూడా తగ్గారు. అది బాగా ఇబ్బందికరం.
రోగి పరిస్థితి గురించి సెంచురీ ఆస్పత్రి వైద్యబృందంలోని సభ్యులు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ అరుణ్‌కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్టు డాక్టర్ పి.రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ, “ఇన్ఫెక్షన్ వచ్చిన నాలుగు వారాల తర్వాత కూడా రోగిలో కొవిడ్-19 యాంటీబాడీలు రూపొందలేదు. ఇది చాలా అరుదైన లక్షణం. ఆయనను సెంచురీ ఆస్పత్రికి వచ్చేసరికి, కొవిడ్ న్యుమోనియా ఉన్నట్లు గుర్తించాం. ఆయన మూత్రపిండాల్లాంటి కీలక అవవయాల పనితీరు కూడా మందగించింది. అప్పుడు ఆయనకున్న సమస్య ఏంటో తెలుసుకోడానికి ఆయన గత వైద్యచరిత్ర ఏంటా అని చూశాం. ఆయనకు 2010 నుంచి వాస్కలైటిస్ మరియు బ్రెయిన్ టీబీ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బ్రెయిన్ టీబీ నయమవ్వగా, వాస్కలైటిస్ కోసం ఇమ్యునోసప్రెసెంట్లు వాడుతున్నారు. రోగి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కొవిడ్-19 ఇన్ఫెక్షన్ తగ్గకపోవడానికి, దీర్ఘకాలం కొనసాగడానికి ఇమ్యునోసప్రెసెంట్లే కారణమని గుర్తించాం.”
“రోగికి మధుమేహం, రక్తపోటు ఏమీ లేవు. అయినా మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ కేవలం ఊపిరితిత్తులనే కాక, అప్పటికే పెద్దవయసు ఉన్నవారికి, లేదా మధుమేహం, రక్తపోటు ఉన్నవారిలో మూత్రపిండాలను కూడా దెబ్బతీస్తుంది. ఇమ్యునోసప్రెసెంట్ మందులు వాడేవారికీ ఇలాగే అవుతుంది. ఈ కేసులో అసలు సమస్య ఏంటో గుర్తించాం. మందులు ఆపగానే తగ్గింది. ఆ తర్వాత చికిత్సకు రోగి సానుకూలంగా స్పందించడం మొదలుపెట్టారు. వారం రోజుల్లో రోగి కీలక పారామీటర్లు అన్నీ సాధారణ స్థితికి వచ్చాయి. కొవిడ్-19 నుంచి కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు” అని వైద్యబృందం తెలిపింది.
కొవిడ్ బాధితుడైన మూర్తి ఇంతకుముందు టీకా తీసుకోలేదు. దేశంలో 10 కోట్ల మంది కనీసం ఒక డోసైనా తీసుకున్న సమయానికీ ఆయన టీకా వేయించుకోలేదు. ఒమిక్రాన్ చాలా తేలికపాటి వేరియంట్ అని చాలా కథనాల్లో చదివాం. కానీ, వయోవృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ఇది కూడా ఎక్కువగానే ఇబ్బంది పెట్టింది. అందువల్ల మనం ఎలాంటి కొవిడ్-19 వేరియంట్‌నూ తేలిగ్గా తీసుకోకూడదు, ఈ సమస్యను నిరోధించడానికి టీకా ఒక్కటే అందుబాటులో ఉన్న అత్యుత్తమ మార్గం.