ఉక్రెయిన్‌కి 150 కోట్ల సాయం : ఐక్యరాజ్య సమితి
రష్యా దాడిలో చితికిల పడుతున్న ఉక్రెయిన్ దేశానికి బాసటగా నిలిచింది ఐక్యరాజ్య సమితి. మానవతా కోణంలో ఈ సాయం చేస్తున్నట్లు వెల్లడించింది. దాడి నేపథ్యంలో చితికిపోతున్న ఉక్రెయిన్ ప్రజల జీవితాలను తిరిగి నిలబెట్టాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఇందులో భాగంగా తక్షణ ఆర్థిక సాయం కింద 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 150 కోట్లు) ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ నిన్న ప్రకటించారు. ఐరాస, దాని మానవతా భాగస్వాములు ఉక్రెయిన్ ప్రజలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్‌లో ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడుతుందని, ధరలు పెరుగుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దాడి కారణంగా మరణాలు పెరుగుతున్నాయని, ఉక్రెయిన్‌లోని ప్రతి మూలలో భయం, వేదన, భయాందోళన నిండిపోయిందని అన్నారు. తాము ప్రకటించిన ఆర్థిక సాయం ఆరోగ్య సంరక్షణ, ఆశ్రయం, ఆహారం, నీటి సరఫరా మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని, ఈ ఆర్థిక సాయాన్ని వెంటనే పంపిణీ చేస్తామని ఐరాస మానవతావాద విభాగం చీఫ్ మార్టిన్ గ్రిపిథ్స్ చెప్పారు.