ఉదయగిరిలో మేకపాటి అంత్యక్రియలు
సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరిగే స్థలం మారింది. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు ముందుగా ఆయన అంత్యక్రియలను తమ సొంతూరు అయిన బ్రాహ్మణపల్లిలోనే నిర్వహించాలని భావించారు. అయితే ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్న కుటుంబసభ్యులు.. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో నిర్వహించాలని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియల నిర్వహణ సమన్వయకర్తగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ను సీఎం జగన్ నియమించారు. ఈ మేరకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియల స్థల మార్పిడి విషయాన్ని సురేశ్ వెల్లడించారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని నెల్లూరు తరలించనున్నట్లు మంత్రి సురేశ్ వెల్లడించారు. ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్ రెడ్డి మృతదేహం ఉదయం 10.15 గంటలకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటుందని, ఆ తర్వాత నెల్లూరులోని గౌతమ్ రెడ్డి నివాసానికి ఆయన భౌతిక కాయం చేరుకుంటుందని, అక్కడే ప్రజలు, మేకపాటి అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నట్లు సురేశ్ చెప్పారు. విదేశాల్లో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు మంగళవారం సాయంత్రానికి నెల్లూరు చేరుకుంటారని, బుధవారం ఉదయగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.