జాతీయ పార్టీ పెడుతా : కేసీఆర్‌

కేంద్రంతో నువ్వా నేనా తేల్చుకునే ప‌నిలో ప‌డ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. గ‌త కొన్ని రోజులుగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో సీఎం చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బహిరంగ స‌భ‌ల్లో, ప్రెస్ మీట్‌ల‌లో భాజ‌పాను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ సాధార‌ణ ఎన్నిక‌ల్లో భాజ‌పా బ‌లం పెర‌గ‌క‌ముందే కుకూటి వేళ్ల‌తో లేపివేయాల‌నే ఆలోచ‌నతో ఉన్న‌ట్టున్నారు సీఎం. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

ప్ర‌గతి భ‌వ‌న్‌లో ఆదివారం నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయన మాట్లాడిన తీరు ఇందుకు అద్దంప‌డుతోంది. బీజేపీ)= అధికారంలో ఉండనే కూడదని ఆయన తీర్మానించారు. ముఖ్యంగా, ప్రజలు కోరుకుంటే జాతీయస్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామని అన్నారు. అవసరం అనుకుంటే కొత్త పార్టీ ఏర్పాటుకు వెనుకంజవేయబోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

గతంలో తాను టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తే అందరూ నవ్వారని, ఇప్పుడు ఏమైందని తిరిగి ప్రశ్నించారు. జాతీయ పార్టీ పెట్టినా విజయవంతం కాగలమన్న నమ్మకం ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని, జాతీయస్థాయిలో పార్టీ పెట్టే దమ్ము తనకుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి నటులు సీఎంలు అయ్యారు… టీ అమ్ముకునే తానే ప్రధానిని అయ్యాయని మోదీ చెప్పారు… ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఏదో ఒకటి జరగడం మాత్రం ఖాయమని ధీమాగా చెప్పారు.