ప్రేగులు పగలకుండా రోగి ప్రాణాలు కాపాడిన కిమ్స్ వైద్యులు
అరుదైన హెర్నియా శస్త్రచికిత్స ద్వారా రోగి ప్రాణాలు కాపాడారు కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు వైద్యులు. ఇలాంటి శస్త్రచికిత్స ఈ ప్రాంతంలో అరుదుగా చేశామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కిమ్స్ హాస్పిటల్స్ బెరియాట్రిక్, జనరల్ సర్జన్ డాక్టర్. వసీం హాసన్ రాజా షేక్ వెల్లడించారు.
కర్నూలుకి సమీప పట్టణమైన తెలంగాణలోని పెబ్బేర్ ప్రాంతానికి చెందిన శివలింగం (66) తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మలం విసర్జన సరిగా లేకపోవడంతో హాస్పిటల్‌కి వచ్చారు. వివిధ పరీక్షలు చేసిన తర్వాత అతనికి సిటి స్కాన్ చేశాం. అందులో అతనికి స్పైగెలియన్ హెర్నియా ఉన్నట్లు గుర్తించాం. ఈ హెర్నియా అనేది ప్రతి పదివేల మందిలో ఒకరి వస్తుంది. సాధారణంగా ఈ సమస్య ఎడమవైపు వస్తుంది కానీ ఈ రోగిలో మాత్రం కుడివైపు వచ్చింది. దీని వల్ల రోగి అధిక ప్రమాదంలోకి వెళ్లారు. గత ఏనిమిదేళ్లుగా కడుపు కింది భాగంలో వాపు ఉన్నట్లు గుర్తించినా… సాధారణ వాపుగా రోగి నిర్లక్ష్యం చేశాడు. గ్యాస్ ట్రబుల్ సమస్య ఉందని తనుకు తానే మందులు తీసుకున్నాడు. తీవ్రమైన ఇబ్బంది రావడంతో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకున్న అతని సమస్య బయట పడలేదు.
బలహీనమైన ఉదర కండరంలో ఒక అవయవం లేదా కొవ్వుతో కూడిన కణజాలంతో ఉదర కుహరం నుండి పొడుచుకొని వచ్చినప్పుడు హెర్నియా ఏర్పడుతుంది. భారీ వస్తువులు ఎత్తినప్పుడు ఉదర కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు వాపు రావడం, తీవ్రమైన నొప్పి, నిలబడినప్పుడు, దగ్గినప్పుడు నొప్పి వస్తుంది. విపరీతమైన దగ్గు, మూత్రం పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నవారికి హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఈ రోగిలో మల విజర్జనకు తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది. దీంతో రైల్స్ ట్యూబ్ ద్వారా మలం బయటకు తీయాల్సి వచ్చింది. ప్రధానంగా ఈ రోగిలో కడుపులోని కండరాలు బలహీన పడడం ద్వారా ఈ సమస్య తలెత్తింది. దీని వల్ల ప్రేగులు పగిలే ప్రమాదం సంభవించేది. సకాలంలో సర్జరీ ద్వారా అడ్డుపడిన హెర్నియాను తొలగించాం. కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌లో లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స అందుబాటులో ఉండడం వల్ల రోగికి ఇబ్బంది లేకుండా డాక్టర్ వసీం హాసన్ రాజా షేక్ ఆధ్వర్యంలో, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ & జిఐ ఆంకాలజి డాక్టర్ జానకిరామ్ మరియు అనస్థీటిస్ట్ డాక్టర్ విజయసాయి సహాకారంతో లాపరోస్కోపిక్ చికిత్స చేయగలిగాం. ఇలాంటి శస్త్రచికిత్స చేయడం రాయలసీమ ప్రాంతంలో చాలా అరుదు.
ఈ సర్జరీ చేయకపోతే రోగి ప్రేగులు పగిలి, మలం కడుపులో విస్తరించి చనిపోయే ప్రమాదం ఉంది. చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నారు. హెర్నియా సమస్యలను ముందస్తుగా గుర్తించి శస్త్రచికిత్సలు చేయించుకోవడం వల్ల గ్యాంగ్రీన్, ప్రేగుల పగిలిపోయే సమస్యలను అధిగమించవచ్చు. హెర్నియా వల్ల వచ్చే సమస్యల వల్ల చనిపోయో ప్రమాదం ఉంటుందని అపోహ ఉంది. ఇలాంటి హెర్నియా చికిత్సలకు లాపరోస్కోపిక్ ద్వారా విజయవంతంగా చికిత్స చేసి కాపాడగలగవచ్చు.