బరువు పెరగట్లేదని చూస్తే.. గుండెలో సమస్య
పుట్టుకతోనే గుండె రక్తనాళాల్లో ఫిస్టులా ఏర్పడిన ఓ చిన్నారికి విశాఖపట్నంలోని కిమ్స్ ఐకాన్ వైద్యులు అత్యాధునిక చికిత్సతో ఆపరేషన్ అక్కర్లేకుండానే ప్రాణదానం చేశారు. ఆ చిన్నారి వయసుకు తగినంతగా బరువు పెరగడం లేదు. ఐదేళ్ల వయసులో కనీసం 18 కిలోల బరువు ఉండాల్సి ఉండగా, కేవలం 12 కిలోలే ఉంది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఆ పాప తల్లిదండ్రులు పిల్లల వైద్య నిపుణులకు చూపించగా, వారు అనుమానంతో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలోని చిన్న పిల్లల గుండె వైద్య నిపుణురాలు డాక్టర్ శాంతిప్రియ వద్దకు పంపారు. ఈ కేసు వివరాలను, పాపకు చేసిన చికిత్స పద్ధతిని ఆమె వివరించారు.
“2డి ఎకో పరీక్ష చేయగా, ఆ పాప ఎడమ వైపు ధమని (గుండెకు మంచి రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం)లో కరొనరీ కామెరల్ ఫిస్టులా ఉన్నట్లు స్పష్టమైంది. ఇది అరుదైన సమస్య. ప్రతి వెయ్యిమందిలో ఒకరికి మాత్రమే వస్తుంది. ఇలాంటివి పుట్టుకతోనే వస్తాయి గానీ, వాటిని గుర్తించడం కొంచెం కష్టం. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఒకటి సరిగా రూపొందకపోవడం వల్ల ఇలా సంభవిస్తుంది. సరైన సమయానికి గుర్తించి, చికిత్స చేయకపోతే మయోకార్డియల్ ఇష్కెమియా, గుండె పనితీరు తగ్గిపోవడం, గుండె లయ తప్పడం లాంటి విపరిణామాలు సంభవిస్తాయి. సాధారణంగా అయితే ఇలాంటి సందర్భాల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి శస్త్రచికిత్సలే చేస్తారు. కానీ, పాప వయసు చాలా తక్కువ కావడంతో అందుకు ప్రత్యామ్నాయంగా ట్రాన్స్‌కాథెటెర్ క్లోజర్ పద్ధతి అవలంబించాలని నిర్ణయించాం. ఇందుకోసం డక్ట్ ఆక్లూడర్ డివైజ్ అనే పరికరాన్ని ప్రత్యేకంగా అమర్చాం. ఇలాంటి పరికరాలతో ఈ సమస్యను సరిచేయడం సాంకేతికంగా చాలా సవాళ్లతో కూడుకున్నదే అయినా.. చాలా సురక్షితమైనది, సమర్ధమైన చికిత్సాపద్ధతి కావడంతో దీన్నే ఎంచుకున్నాం. ఈ చికిత్స చేసిన తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. కొన్ని మందులు వాడాలని రాసిచ్చి, డిశ్చార్జి చేశాం. అయితే, కొంతకాలం పాటు తరచు ఆమెకు వైద్యపరీక్షలు చేస్తుండాలి” అని డాక్టర్ శాంతిప్రియ వివరించారు. ఈ చికిత్సలో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చెందిన పిల్లల గుండెవైద్య నిపుణుడు డాక్టర్ సుదీప్ వర్మ, విశాఖపట్నం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి చెందిన కార్డియాక్ అనెస్థెటిస్టు డాక్టర్ సుజిత్ కూడా పాల్గొన్నారు.