తెలంగాణ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టం
తెలంగాణ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకరావడానికి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కొత్తం చట్టం తీసుకురావాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ఫీజులు నియంత్రించాల్సిన అవసరం ఉందని క్యాబినెట్ అభిప్రాయపడింది. అంతేకాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించారు.
ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టం, ఇంగ్లీషు మీడియం అంశాలపై అధ్యయానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ సబ్ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఇందులో మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉంటారు. ఫీజుల నియంత్రణ, ఇంగ్లీషు మీడియం అంశాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం జరిపి విధివిధానాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఈ సబ్ కమిటీకి సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.