సూది పార్టీలతో సంది యేలా దొర
అవి సూది పార్టీలు అవసరం ఉన్నప్పుడు వస్తాయి… వచ్చాకా ఎక్కడ పడితే అక్కడ కుచ్చుతాయి… ఇవి సాక్షాత్తూ… వామపక్ష పార్టీలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ నిండు సభలో అన్నమాటలు. ఆ పార్టీలకు స్థానం లేదంటూ కూరలో కరివేపాకు తీసేసినట్టు అనేక వేదికల మీద మాట్లాడారు. కానీ కాలం సమాధానం చెప్పింది. ఏ పార్టీలను తీసిపారేశాడో… ఆ పార్టీ నేతలకే కిందకు దిగి వచ్చి స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్‌కి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో వెన్నతో పెట్టిన విద్య అని మరోమారు రుజువైంది. ఇప్పటికే కేంద్రంతో యుద్ధం చేస్తానని చెప్పిన ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని విపక్షాలను ఏకం చేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ అది ఎప్పుడు ముందుకు పడడం లేదు. ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఢీ కొట్టాలని దేశ పర్యటనలు చేస్తున్నారు. కాగా ఏనాడు కూడా అతను కలిసిన నాయకుల నుండి సరైన సమాధానం రావడం లేదు.
అయితే వామపక్ష పార్టీలను ముందు తనలో కలుపుకొని వారితో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన సీపీఎం అగ్రనేతలు.. సీఎం కేసీఆర్ ను కలిశారు.
ఈ భేటీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తదితరులు హాజరయ్యారు. వీరంతా సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానం మీద ప్రగతిభవన్ కు వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం సీపీఐ అగ్రనేతలైన పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా.. ఆ పార్టీ పార్లమెంటరీ నేత బినయ్ విశ్వం.. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్ తో విడిగా భేటీ కావటం గమనార్హం.
ఈ సందర్భంగావారి మధ్యన పంజాబ్ లో చోటు చేసుకున్న రైతుల నిరసన.. ప్రధాని కాన్వాయ్ ను నిలిపివేసిన ఉదంతం మాటల మధ్య వచ్చినట్లుగా తెలుస్తోంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాముపని చేస్తున్నామని.. ఈ విషయంలో దేశంలోని భావసారూప్యత కలిగిన ప్రగతిశీల పార్టీలు.. శక్తులన్నీ ఏకం కావాలని.. ఒకే వేదిక మీదకు రావాల్సిన అవసరం ఉందన్న ఆకాంక్ష వ్యక్తమైంది. మొత్తానికి రోగి కోరుకున్నది.. డాక్టర్ చెప్పేది ఒకటే అయినప్పడు ఇంకేంసమస్య ఉంటుంది చెప్పండి.